సంతాన 'మా'లక్ష్మి

Couple Fear on Family Planning Operation - Sakshi

8వ కాన్పులో మగబిడ్డకు జన్మ

కు.ని. అంటే భయమట!

చిత్తూరు : సోమ, మంగళ, బుధ, గురు, శుక్రా, శనీ, ఆదీ వీడికి పేరేదీ..పుట్టే వాడికి చోటేదీ..? పెంచేదెట్లా.../ పెట్టలేక మనపని గోవిందా/కలిగిన చాలును ఒకరూ ఇద్దరూ/.. కాకుంటే ఇంకొక్కరు..! అని అధిక సంతానంతో పడుతున్న బాధలపై ఓ పాత సిన్మాలో రాజబాబు పాటుంది. ఆ పాటకు తామేమీ తీసిపోమని ఓ సంతాన మాలక్ష్మి దంపతులు చాటుకుంటున్నారు. శుక్రవారం ముచ్చటగా ఎనిమిదో కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. మండలంలోని తడుకుపేట ఆదిఆంధ్రవాడకు చెందిన వి.గీత (32) శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఎనిమిదవ కాన్పులో పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అంటే ఆమెకు భయం ఉండటం, కనీసం వైద్య, ఆరోగ్య సిబ్బంది అయినా ఆమెకు, ఆమె భర్తకు ఈ విషయంలో అవగాహన కల్పించారో లేదో తెలియదుగానీ మొత్తానికి కాన్పులతో రికార్డు సృష్టిస్తున్నారు. 24వ ఏట తొలికాన్పుతో మొదలై  నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నగరి ఆస్పత్రి గైనకాలజిస్టు మంజుల ఎనిమిదో కాన్పు చేశారు. 

సాధారణంగా తొలి ప్రసవ సమయంలోనే సుఖప్రసవం మహిళలకు చాలా కష్టతరమని, అలాంటిది 8వ కాన్పు సైతం సుఖప్రసవం కావడం అరుదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు జన్మనిచ్చిన బిడ్డతో కలుపుకుంటే ఎనిమిది మంది పిల్లల్లో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. 8వ కాన్పుకు గీత ఆస్పత్రికి వచ్చే సమయానికి నొప్పులు పడుతుండడంతో  కష్టం మీద తల్లికి, బిడ్డకు ఎలాంటి హాని లేకుండా సుఖప్రసవం చేశామని వైద్యురాలు చెప్పారు.

ఎనిమిదో శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ అంటే ఉన్న భయం కొద్దీ కు.ని. చేయించుకోలేదని గీత అంటోంది. పెద్దవాడు స్కూలుకు వెళ్తుండగా, తక్కిన వారు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నారట! గీత, ఆమె భర్త ఇద్దరూ కూలీ పనులపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నవారే కావడం గమనార్హం. గ్రామస్తులు ఎనిమిది మంది సంతానాన్ని చూసి అష్టదిక్పాలకులు అని చమత్కరిస్తున్నారు. వైద్య–ఆరోగ్య సిబ్బంది ఇకనైనా వీరికి అవగాహన కల్పించి, దంపతులను కు.ని.వైపు నడిపించకపోతే మరో వచ్చే ఏడాది ముగిసేనాటికి మరో శిశువుకు జన్మనిచ్చినా ఆశ్చర్యం లేదని గ్రామస్తులు అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top