పుణ్యక్షేత్రాలకు కరోనా ఎఫెక్టు

Corona Virus Effect For Famous Temples - Sakshi

ప్రధాన ఆలయాలన్నింటిలో భక్తుల దర్శనాలు నిలిపివేత

సాక్షి, అమరావతి/తిరుపతి : ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఆయా దేవస్థానాల ముందు జాగ్రత్తలతో భక్తుల రాక బాగా తగ్గింది. తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో దర్శనాలను నిలిపివేయడం ఇందుకు కారణం. గ్రహణ సమయాల్లో మినహా గతంలో ఎప్పుడూ ఇలా దర్శనాలను నిలిపివేసిన దాఖలాల్లేవని పూజారులు, ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. టీటీడీ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకూ ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదని అధికారులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ జారీచేసిన జీఓ 204తో మసీదులు, చర్చిల్లో కూడా భక్తులు రాకుండా ప్రజాహితార్థం చర్యలు తీసుకుంటున్నారు.

ఆలయాల్లో ప్రత్యేక హోమాలు
లోకకళ్యాణార్థం కరోనా వైరస్‌ నివారణను కాంక్షిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహించాలంటూ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో అధికారులను కోరారు. అన్ని ఆలయాల్లో మహా మృత్యుంజయ, శీతలాంబ, భాస్కర ప్రశస్తి, ధన్వంతరి హోమాలు.. అనారోగ్య నివారణా జప హోమాదులు, పారాయణలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా భక్తులు స్వచ్ఛందంగా దైవ దర్శనాలను వాయిదా వేసుకోవాలని మంత్రి కోరారు. గ్రామోత్సవాలు జాతర్లకూ అనుమతిలేదని మంత్రి వివరించారు. ఈనెల 31వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

బోసిపోతున్న తిరుమల
కరోనా ఎఫెక్ట్‌ కారణంగా తిరుమలకు భక్తులను అనుమతించకపోవటంతో కొండపై వెళ్లే ఘాట్‌ రోడ్లు, క్యూలైన్లు వెలవెలబోతున్నాయి. తిరుమలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు, తిరుమల స్థానికులను క్షుణ్నంగా పరీక్షించాకే టీటీడీ తిరుమలకు అనుమతిస్తోంది. తిరుమలలోని రెండు బస్టాండ్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. భక్తుల ఆకలిని తీర్చే తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం కార్యక్రమం కూడా నిలిపివేశారు. లడ్డు ప్రసాద వితరణ కేంద్రం వెలవెలబోతోంది. నాలుగు మాడ వీధులు నిర్మానుష్యంగా మారాయి. కాగా, తిరుమల నిత్య  కల్యాణవేదికలో గురు, శుక్రవారాల్లో కేవలం ఏడు వివాహాలు మాత్రమే జరిగాయి. స్వామి వారి కైంకర్యాలు మాత్రం ఏకాంతంగా యథావిధిగా జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి 8.30 గంటలకల్లా ఏకాంతం సేవను పూర్తి చేసి ప్రధాన మహాద్వారాన్ని మూసివేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top