ఏపీలో మరో కరోనా కేసు నమోదు.. | Corona Positive Case Registered In Prakasam District | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో కరోనా కేసు నమోదు..

Mar 19 2020 11:03 AM | Updated on Mar 19 2020 11:35 AM

Corona Positive Case Registered In Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. లండన్‌ నుంచి  ఒంగోలుకు వచ్చిన ఒక యువకుడికి  కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు నిర్థారించారు. కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అత్యవసర సమీక్ష నిర్వహించి  కరోనా నియంత్రణ చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 13న యువకుడు లండన్  నుంచి ఒంగోలు మంగమూరు రోడ్డులోని తన నివాసం ఉన్న జెడ్పీ కాలనీకి చేరుకున్నారు. లండన్‌ నుంచి ఢిల్లీకి చేరుకుని అక్కడ రెండు రోజలు ఉండి.. హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం ఏసీ బస్సులో ఒంగోలుకు చేరుకున్నాడు. 14న గుంటూరు వెళ్ళి తిరిగి ఒంగోలులోని తన నివాసానికి వచ్చిన అనంతరం ఆ యువకుడు 15న తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. ఒంగోలు రిమ్స్‌లో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. (కరోనా అలర్ట్‌: ఎయిర్‌పోర్టు ఖాళీ)

కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ వ్యక్తి రక్త పరీక్ష నమూనాలను విజయవాడ సిద్ధార్థ మెడికల్‌ సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపించారు. ఎర్రర్‌ రావడంతో స్వాబ్స్‌ను వైద్యులు తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. కోవిడ్‌-19 గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు బాధితుడితో పాటు కుటుంబసభ్యులను తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. పెర్రీ మీటర్‌ ఆధారంగా స్టేజ్‌-1,2 ప్రాతిపదికన పాజిటివ్‌ కేసు నమోదైన రోగి పరిసర ప్రాంతాల్లోని మూడు కిలోమీటర్ల పరిధిలో లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. (కరోనాపై కొన్ని అపోహలూ... వాస్తవాలు)

కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ ప్రభుత్వం బులెటిన్‌
కరోనా వైరస్‌ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ ప్రభుత్వం బులెటిన్‌ విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో కరోనా (కొవిడ్‌-19) పాజిటివ్‌  కేసు నమోదయిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 883 మంది ప్రయాణికులు వైద్యుల పరీశీలనలో ఉన్నారని.. 254 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. 22 మంది ఆసుపత్రిలో వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 109 మంది శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపగా ఇద్దరికి పాజిటివ్‌, 94 మందికి నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు.

కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో​ ప్రచారం అవుతున్న వదంతుల్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జవహర్‌రెడ్డి హెచ్చరించారు. విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు జారీ చేశామని..అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు  చేపట్టామని పేర్కొన్నారు. వైరస్‌ నియంత్రణకు నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. ఆందోళన పడొద్దన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement