నేటి నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె | Contract Municipal Labour Unions announced Strike | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల సమ్మె

Oct 21 2013 2:24 AM | Updated on Oct 16 2018 6:35 PM

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆదివారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 164 మునిసిపాలిటీలు, 19 కార్పొరేషన్లలో పనిచేస్తున్న 25 వేల మందికి పైగా కార్మికులు సమ్మెలోకి వెళుతున్నారు. కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా వీరిలో ఉన్నారు.
 
 నెలసరి కనీస వేతనం రూ.12,500 చెల్లించాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఆ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, తమ ఉద్యోగాలను దశల వారీగా క్రమబద్ధీకరించాలని, జాతీయ సెలవు దినాలు, వారాంతపు సెలవు దినాలు ఇవ్వడంతో పాటు సబ్బులు, దుస్తులు ఇవ్వాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల సాధనకు రెండు నెలలుగా వివిధ రకాల ఆందోళనలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రెండు దఫాలుగా అధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 కాంట్రాక్టు కార్మిక సంఘాలు సమ్మెలోకి వెళ్లనున్నట్లు నేతలు ప్రకటించారు. వీరి సమ్మెకు ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఎన్‌టీయూసీ తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిన్నమొన్నటి దాకా సీమాంధ్ర జిల్లాల్లో మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. వీరి సమ్మె విరమణ జరిగిన వారంలోపే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు సమ్మెలోకి వెళ్లనుండటంతో అంతంత మాత్రంగా ఉన్న నగర పారిశుధ్యం పూర్తిగా చతికిలపడనుంది.
 
 అందుబాటులో లేని శాఖాధిపతులు...
 కార్మికుల సమ్మె విరమణకు చర్చలు జరపడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపల్ శాఖ అధిపతులు ముగ్గురూ అందుబాటులో లేరు. వ్యక్తిగత పనులపై ముఖ్య కార్యదర్శి సెలవులో ఉన్నారు. కార్యదర్శి శిక్షణలో ఉన్నారు. కమిషనర్ ‘అధ్యయనానికి’ ఇజ్రాయిల్ వెళ్లారు. ‘గ్రేటర్’ కమిషనర్ ఉన్నప్పటికీ సమ్మెలోకి వెళ్లే కార్మికులను కనీసం చర్చలకు కూడా పిలవలేదు. 

Advertisement
 
Advertisement
Advertisement