ఓట్లేసి గెలిపించిన రాష్ర్ట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని, రాజ్యంగబద్ధంగా ఎటువంటి పదవీ లేని దిగ్విజయ్‌సింగ్ చేతుల్లో రాష్ట్ర
ప్రజలను మోసగించిన కాంగ్రెస్
Dec 26 2013 3:32 AM | Updated on Mar 18 2019 9:02 PM
	గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :ఓట్లేసి గెలిపించిన రాష్ర్ట ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని, రాజ్యంగబద్ధంగా ఎటువంటి పదవీ లేని దిగ్విజయ్‌సింగ్ చేతుల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఉంచిందని సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని రాజకీయ జేఏసీ వేదికపై బుధవారం విద్యుత్‌శాఖ ప్రైవేట్ బిల్ కలెక్టర్లు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ  బిల్లు అసెంబ్లీ, పార్లమెంటులలో ఆమోదం పొందకుండానే, 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని దిగ్విజయ్ సింగ్ చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టిన నాటి నుంచి అన్ని అంశాల్లో రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఏ పదవీ లేని దిగ్విజయ్‌సింగ్‌కు విభజన ప్రక్రియ అప్పగించి, ఓట్లేసి అధికారం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. 
	 
					
					
					
					
						
					          			
						
				
	 రాజ్యాంగ విరుద్ధంగా విభజన చేపడితే ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు ఉన్నాయని, అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు. దీక్షలో కూర్చున్న పాదర్తి లక్ష్మీకుమారి, ఎ.విజయ్‌కుమార్, టి.శేషుబాబు, పి.సాంబశివరావు, ఆర్.మల్లేశ్వరరావు, మల్లికార్జునరావు, మనోరంజన్‌బాబులకు సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్, నాయకులు జెట్టి ఝాన్సీరాణి, మిట్టపల్లి నాగేశ్వరరావు, దేవరశెట్టి అప్పారావు, సీహెచ్ కృష్ణప్రసాద్, గ్రంధి పార్ధసారధి సంఘీభావం తెలిపారు. 
Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
