రైతుల పేర్లు గల్లంతు | Confusing loan waiver lists | Sakshi
Sakshi News home page

రైతుల పేర్లు గల్లంతు

Published Tue, Dec 9 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

రైతుల పేర్లు గల్లంతు

రైతుల పేర్లు గల్లంతు

రైతుల రుణమాఫీ అర్హుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్లో ఉంచింది. అయితే ఆ జాబితాల్లో కొంత మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి.

గందరగోళంగా రుణమాఫీ జాబితాలు
వివరాల కోసం వెళ్లిన  రైతులను తిప్పి పంపిన బ్యాంకులు
ఇంటర్నెట్ సెంటర్లలో పేర్లు చూసుకోవచ్చని ఉచిత సలహాలు
కొన్ని చోట్ల తెరుచుకోని వెబ్‌సైట్లు..
మరికొన్ని చోట్ల అర్థం కాని జాబితాలు తండ్రి పేరుంటే, కుమారుల పేర్లు అదృశ్యం

 
గుంటూరు: రైతుల రుణమాఫీ అర్హుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వం వెబ్ సైట్లో ఉంచింది. అయితే ఆ జాబితాల్లో కొంత మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దాంతో వారిలో ఆందోళన నెలకొంది. రుణ మాఫీ అర్హుల జాబితాను ఆయా బ్యాంకుల బ్రాంచీలకు పంపినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో తమ పేర్లు ఉన్నాయో లేవో తెలుసుకొనేందుకు రైతులు సోమవారం బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. బ్యాంకు సిబ్బంది వెబ్‌సైట్‌లో జాబితా ఉంది చూసుకోమనడంతో రైతులంతా కాళ్లీడ్చుకుంటూ నెట్ సెంటర్లను ఆశ్రయించారు.

 కొన్ని చోట్ల వెబ్‌సైట్లు తెరుచుకోకపోవడం,మరి కొన్ని చోట్ల పేర్లు లేకపోవడంతో రైతులు నిరాశతో  వెనుదిరిగివెళ్లారు. నెట్ జాబితాల్లో కొందరి పేర్లు గందరగోళంగా ఉండటంతో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడినట్టు చెపుతున్నారు.
 
2006లో రేషన్ కార్డులను జారీ చేశారు. అప్పుడు తండ్రి, కుమారులు పేర్లు అన్నీ ఒకే రేషన్ కార్డులో ఉన్నాయి. ఆ తరువాత కొన్ని కుటుంబాలు వేరు పడ్డాయి. దీంతో చాల మందికి రేషన్ కార్డులు రాలేదు.
 
ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కుమారులు తలా రూ. 1.50 లక్షల రుణం తీసుకొన్నారు. అయితే ప్రస్తుత రేషన్ కార్డు ఆధారంగా తండ్రి మాత్రమే రుణ మాఫీకి అర్హులవుతారు. మిగిలిన ఇద్దరు కుమారులు రేషన్ కార్డు ఆధారంగా రుణ మాఫీకి అర్హులు కాకుండా పోయారు. ఇలాంటి వడపోతలతో లక్షల మంది పేర్లు గల్లంతు అయినట్టు చెపుతున్నారు.
 
మరికొంత మందికి పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అధిక శాతం రైతుల పేర్లు గల్లంతు అయ్యాయంటున్నారు. ఇలాంటి వారంతా 14 శాతం వడ్డీతో రుణాలు చెల్లించాల్సి ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
11.70 లక్షల ఖాతాలకు...అర్హులు దాదాపు 3లక్షల లోపే..

జిల్లా వ్యాప్తంగా 11.70 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్నారు. ముఖ్యమంత్రి మాటలు నమ్మి మాఫీ అవుతాయని ఎవరూ రుణాలను తిరిగి చెల్లించ లేదు. తీరా జాబితాల్లో పేర్లు చూసుకున్నాక బాబును నమ్మి నట్టేట మునిగామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రూ. 50వేల వరకు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ కానుంది. ఇలాంటి ఖాతాలు జిల్లాలో లక్షలోపు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా రెండు లక్షల ఖాతాలకు అంటే రూ. 50 వేల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు మొదటి విడతలో 20 శాతం సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. మిగతా సొమ్ము ఐదేళ్లలోపు ప్రభుత్వమే చెల్లించనుంది.
 
రెండవ విడత జాబితాపై ఆశలు...

 రేషన్ కార్డు, ఆధార్ కార్డులేని వారికి, ధ్రువీకరణ పత్రాలు సమర్పించని వారికి అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు మాటలను మాత్రం చాల మంది రైతులు విశ్వసించడం లేదు. కొంత మంది రైతులు రెండవ జాబితాలోనైనా రుణ విముక్తులమవుతామని ఆశగా ఎదురు చూస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement