నిధులు కేటాయించి చేతులెత్తేశారు

Comptroller and Auditor General Fires On Past TDP Govt - Sakshi

టీడీపీ పాలనను కడిగేసిన కాగ్‌  

2017–18 బడ్జెట్‌లో కేటాయించిన 34,602.10 కోట్లు ఖర్చు చేయలేదు  

సాక్షి, అమరావతి: పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత చందంగా సాగిన తెలుగుదేశం పార్టీ గత పాలనను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక సైతం కడిగేసింది. చంద్రబాబు హయాంలో బడ్జెట్‌ కేటాయింపులు భారీగా చేసి.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి ఖర్చు చేయకుండా చేతులెత్తేసిన వైనాన్ని తేటతెల్లం చేసింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి విద్యారంగంతో పాటు వివిధ శాఖలకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులను భారీగా చూపించి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపింది. అప్పటి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం 34,602.10 కోట్లు ఖర్చు చేయలేదు. ప్రతి కేటాయింపులో 21 విభాగాల గ్రాంట్లకు సంబంధించిన మొత్తం 24,357.29 కోట్లు మిగిలిపోవడంపై కాగ్‌ కడిగి పారేసింది. 8 విభాగాల్లో 20 శాతానికి మించి మిగిలిపోయిన మొత్తం 21,079.14 కోట్లుగా ఉండటం విశేషం. మొత్తం గ్రాంట్లలో రూ.1,000 కోట్లకు పైగా ఖర్చు చేయకుండా ఉంచేసిన విభాగాలు రెండు ఉన్నాయి. 

ఆర్థిక పాలన, ప్రణాళిక, సర్వే, గణాంకాలు, పాఠశాల విద్య విభాగాల్లో బడ్జెట్‌లో భారీగా నిధులు చూపి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపారు.  

అంతకు ముందూ అంతే.. 
2017–18 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా అంతకు ముందు మూడేళ్లలోనూ తెలుగుదేశం ప్రభుత్వ ఘనకార్యం ఇదేనని కాగ్‌ ఆక్షేపించింది. బడ్జెట్‌లో కేటాయింపులు, వాస్తవానికి చూస్తే ఎలాంటి ఖర్చు చేయకుండా మిగులుగా చూపించడం అప్పటి ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఆర్థిక పాలన, ప్రణాళిక, సర్వే, గణాంకాలు, పాఠశాల విద్య విభాగాల్లో బడ్జెట్‌లో భారీగా నిధులు చూపి ఖర్చుకు వచ్చేసరికి మొండిచేయి చూపారు. 

అప్పులు చేసి దుబారా
అప్పులు తెచ్చి దుబారా చేయడం వల్ల టీడీపీ సర్కార్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా చావుదెబ్బ తీసిందని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక తేల్చింది. 2018 మార్చి నాటికి అప్పులు రూ.2,23,706 కోట్లకు పెరిగాయని.. ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది. చేసిన అప్పులు చాలక.. రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి 231 రోజులు చేబదులుగా (వేజ్‌ అండ్‌ మీన్స్‌), ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ.45,860.75 కోట్లను తీసుకుని.. వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల రూ.44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందంటూ ఎత్తిచూపింది. ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కారు వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్‌ పేర్కొంది. 2017–18 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై అధ్యయనం చేసిన కాగ్‌.. టీడీపీ సర్కార్‌ దుబారాను ఏకిపారేస్తూ బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది. 

ఆ నివేదికలో ప్రధాన అంశాలివీ..
► 2015–16 నుంచి 2017–18 మధ్య కాలంలో ద్రవ్యలోటును అదుపు చేయడంలో విఫలం. 
► అప్పులు చేసి ఆస్తులు కల్పించాల్సిన సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరించింది. దుబారా ఖర్చులు చేసి.. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసింది. దీనివల్ల మార్చి, 2018 నాటికి అప్పుల భారం రూ.2,23,706 కోట్లకు పెరిగింది.
► తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి 2016–17లో 18.27 శాతం నుంచి 2017–18లో 33.51 శాతానికి పెరిగింది. 
► కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చడం కోసం మళ్లించారు. దీని వల్ల రాబోయే ఏడేళ్లలో తీర్చాలిన రుణం రూ.91,599.32 కోట్లకు పెరిగింది. 

రోడ్లలోనూ లూటీ! 
టీడీపీ హయాంలో పంచాయతీరాజ్‌ శాఖ రోడ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలను ‘కాగ్‌’ తప్పుబట్టింది. 2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై కాగ్‌ నివేదిక బుధవారం విడుదలైంది.  
 
కాగ్‌ నివేదికలో ఏముందంటే.. 
► గత సర్కారు హయాంలో రూ.180.32 కోట్లు ఖర్చు పెట్టి 352 కి.మీ మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించి కేటాయించిన నిధులలో 99.50 శాతం (రూ.179.41 కోట్లు) వెచ్చించి కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని కాగ్‌ తప్పుబట్టింది. వైఫల్యానికి కారణాలు కూడా వెల్లడించలేదని నివేదికలో పేర్కొంది.  
► ఏపీ గ్రామీణాభివృద్ధి చట్టం–1996 సెక్షన్‌ 7 ప్రకారం గత ఏడాదిలో వసూలు చేసిన గ్రామీణాభివృద్ధి సెస్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి నిధికి బదలాయించాలి. 2016–17 ఆర్థిక ఏడాదిలో రూ.552.41 కోట్లు సెస్‌ రూపంలో వసూలైనప్పటికీ గ్రామీణాభివృద్ధి నిధికి కేవలం రూ.322.36 కోట్లు మాత్రమే బదలాయించారు. రూ.230.05 కోట్ల మేర నిధులను తక్కువగా బదలాయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top