కుటుంబానికి 150 పనిదినాలు 

CM YS Jagan Letter To PM Modi - Sakshi

పరిమితి పెంచాలంటూ ప్రధానికి సీఎం జగన్‌ లేఖ 

ప్రస్తుతం గరిష్టంగా ఏడాదికి వంద పనిదినాలే 

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కల్పించే పనిదినాల సంఖ్యను పెంచాలంటూ సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి గరిష్టంగా 100 పనిదినాలు మాత్రమే  కల్పించే వీలుంది. దీన్ని 150 పనిదినాలకు పెంచడానికి అనుమతించాలంటూ సీఎం జగన్‌ తన లేఖలో ప్రధానిని కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధి అవకాశాలకు తీవ్ర భంగం ఏర్పడిందని లేఖలో సీఎం జగన్‌ ప్రస్తావించారు. 

► విపత్కర సమయంలోనూ గ్రామాల్లో పని కావాలని అడిగిన పేదలకు కరోనా నియంత్రణ మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్రంలో ఉపాధి హమీ పథకం ద్వారా పనులు కల్పించినట్టు ప్రధానికి రాసిన లేఖలో సీఎం వివరించారు.  
► వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నగరాల నుంచి తిరిగి తమ గ్రామాలకు రావడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనుల కోసం భారీ డిమాండ్‌ ఉందని, వారి అవసరాలను గుర్తించి కొత్త జాబ్‌కార్డులు అందించడంతో పాటు తగిన మేరకు పనులు కల్పిస్తున్నట్టు తెలిపారు. 
► కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్బర్‌ ప్యాకేజీ’లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి రూ. 40 వేల కోట్లు అదనపు నిధులు కేటాయించడాన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు.  
► లాక్‌డౌన్‌ కారణంగా గ్రామాల్లో ఎందరో పేదలకు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోయిన పరిస్థితులలో.. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి గరిష్టంగా వంద రోజులు మాత్రమే పని కల్పించాలన్న పరిమితిని 150 రోజులకు పెంచాలని సీఎం జగన్‌ తన లేఖలో ప్రధానికి వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top