ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే

CM YS Jagan Comments at State Level Bankers Committee Meeting - Sakshi

ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులు మినహాయించుకోరాదు

ఇందు కోసం నిర్దేశిత ఖాతాలు తెరవాలి

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రభుత్వం పలు పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని, బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించు కోకూడదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఇలా మినహాయించు కోలేని రీతిలో అన్‌ ఇన్‌ కంబర్డ్‌ (నిర్దేశిత) బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలను బ్యాంకర్లకు వివరించారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని అన్నారు.

వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని సూచించారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన రశీదును గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ అందిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇస్తే, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గతంలో (గత ప్రభుత్వంలో) కొన్ని చెప్పి వాటిని అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పుడు అలా కాదని.. తాము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు.

ముద్ర రుణాల పంపిణీపై దృష్టి సారించాలి
ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని, దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానిని సానుకూలంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా (85 శాతం) ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు బాగా పడినందున రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉన్నాయని, రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందన్నారు.

సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి రెండు వేల జనాభాకో గ్రామ సచివాలయం త్వరలో ప్రారంభం అవుతుందని, వారి సేవలను బ్యాంకర్లు వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. రైతులు, కౌలు రైతులకు రుణాల పంపిణీలో వీరి సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల షాపు ఉంటుందని, అక్కడే రైతులకు వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వర్క్‌షాపు ద్వారా వ్యవసాయంలో అత్యుత్తమ విధానాలను రైతులకు తెలియజేస్తామని, ప్రకృతి వ్యవసాయంపై కూడా వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. కరువు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చిరుధాన్యాలను బాగా ప్రోత్సహిస్తామని తెలిపారు. వీరికి రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రాసెసింగ్‌ యూనిట్లకు తగిన రుణ సహాయం చేస్తే, ఔత్సాహిక యువకులు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందని సీఎం సూచించారు.  

ఔత్సాహికులకు చేయూత ఇవ్వండి..
ఆర్థిక రంగం మందగమనం సూచనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ఔత్సాహికులు ఎంతో మంది కంపెనీలు పెడుతున్నారని, వారికి బ్యాంకర్లు చేయూత నివ్వాలని కోరారు. బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. వైఎస్సార్‌ నవోదయం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, బ్యాంకర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాలన్నారు. చిన్న మొత్తాలకు ఇంకా భారీ వడ్డీలను వసూలు చేస్తున్నారని, ఐదు వేలు, పది వేలకు కూడా పెద్ద ఎత్తున వడ్డీలు వసూలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి చిన్న రుణాల విషయంలో సామాన్యులను ఆదుకోవడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పొగాకు రైతుల రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలన్నారు. సీఎం ఆరుతడి పంటలను, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఆ రైతులకు రుణాలు అందించాలని కోరారు.

2 వేల జనాభాకు బ్యాంకింగ్‌ సదుపాయం 
ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకింగ్‌ సుదుపాయం ఉండాల్సిందేనని ఆర్‌బీఐ రీజినల్‌ డైరెక్టర్‌ సుబ్రతాదాస్‌ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షాలు బాగా కురుస్తున్నందున వ్యవసాయ రంగం ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఆశించిన రీతిలో రుణాలు అందుతున్నాయన్నారు. కౌలు రైతుల కోసం ముఖ్యమంత్రి  తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయని నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సెల్వరాజ్‌ ప్రశంసించారు. దీని వల్ల వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు అందుతాయని అన్నారు. కేవలం పంట రుణాలే కాకుండా ఇతరత్రా రుణాలు కూడా కౌలు రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

పాలనలో సమూల మార్పులు 
ప్రభుత్వ పరిపాలన దృక్పథంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ అన్నారు. పరిపాలనలో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులను తీసుకువస్తోందని.. వలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల క్షేత్ర స్థాయిలో చివరి వరకూ అనుసంధానం ఉంటుందని చెప్పారు. దీన్ని బ్యాంకులు బలంగా వినియోగించుకోవాలన్నారు. సీఎం అనేక వర్గాల వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, వివిధ పథకాల లబ్ధిదారులు, వారి బ్యాంకు ఖాతాలను ఎస్‌ఎల్‌బీసీకి అందిస్తామని, నేరుగా లబ్ధిదారులకే నగదు అందేలా చూడాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top