అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

CM YS Jagan Comments On Jagananna Chedodu Scheme launch - Sakshi

‘జగనన్న చేదోడు’ పథకం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌

శతాబ్ధాలుగా శ్రమనే నమ్ముకుని కష్టపడుతున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకం 

సొంత షాపు కలిగిన నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు రూ.10 వేల చొప్పున సాయం

మొత్తం 2,47,040 మందికి రూ.247.04 కోట్లు జమ

ఎలా ఎగ్గొట్టాలన్నది కాకుండా ఎలా లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల వరకు అవకాశం

నాకు ఓటు వేయకపోయినా సరే, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలనే ఆలోచిస్తాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. రైతు భరోసా, అమ్మఒడి, పింఛన్‌ కానుక, ఆరోగ్యశ్రీ, వాహన మిత్ర, సున్నా వడ్డీ, విద్యా దీవెన,వసతి దీవెన, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలన్నీ అమలు చేశాం. జూలై 8న 30 లక్షల మందికి పైగా పేద మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలివ్వబోతున్నాం. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని దేవుని దయతో, మీ ఆశీస్సులతో నెరవేర్చగలుగుతున్నాను.
– సీఎం వైఎస్‌ జగన్‌

అన్నదమ్ములు లేని లోటు తీర్చారు
ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మమ్మల్ని గుర్తించ లేదు. జగనన్న చేదోడు పథకంలో పదివేల సాయంకు  మేము ఎంపికయ్యామని వలంటీర్‌ చెప్పడం సంతోషం కలిగించింది. ఈ పది వేలు మాకు ఇస్త్రీ పెట్టె కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి. నాకు ఇద్దరు పిల్లలు. పాపకు విద్యా దీవెన కింద రూ.పదివేలు వచ్చాయి. కరోనా సమయంలో మీరు ఇచ్చిన రేషన్, వెయ్యి రూపాయలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను డ్వాక్రా సంఘంలో సభ్యురాలిని. మా సంఘానికి 20 వేలు సున్నా వడ్డీ ద్వారా లబ్ధి కలిగింది. నాకు అన్నదమ్ములు లేని లోటును మీరు తీర్చారు. రైతు భరోసా కూడా వచ్చింది. ఇంటి స్థలం కూడా రాబోతోంది.  
– కోటిపల్లి రామతులసి,రజక వృత్తి, తూర్పు గోదావరి జిల్లా

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. సొంతంగా షాపు కలిగి ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం చేసే ‘జగనన్న చేదోడు’ పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.  తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా మొత్తం 2,47,040 మంది ఖాతాల్లో ఒకేసారి రూ.247.04 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని లబ్ధిదారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన చెక్కును విడుదల చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు తదితరులు 

చెమటోడుస్తున్న గొప్ప మనుషుల కోసం..
► కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ తమ శ్రమను మాత్రమే నమ్ముకుని చెమటోడుస్తూ కష్టపడుతున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో భాగంగా ఈ రోజు నా రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ సోదరులకు ఆర్థిక సహాయం చేస్తున్నా. 
► లబ్ధిదారులకు ఏమైనా రుణాలుంటే ఈ మొత్తం ఆ ఖాతా కింద బ్యాంకులు తీసుకోకుండా, బ్యాంకర్లతో మాట్లాడి వాటిని అన్‌ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో జమ చేస్తున్నాం.
► కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వారితో పనులు చేయించుకోలేక పోవడంతో నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీల కుటుంబాలు కష్టాల పాలయ్యాయి. గతంలో కూడా వారి కష్టాలు చూసి హామీ ఇచ్చా. వాటిని మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నా. అందుకే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్‌ అని మరోసారి స్పష్టం చేస్తున్నా.
► ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించాం. గ్రామ సభల్లో అందరికీ చూపించి, మాట్లాడిన తర్వాతే ఎంపిక చేశాం.

అర్హులెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోండి 
► అర్హులు ఎవరికైనా ఇప్పుడు రాకపోతే ఆందోళన చెందొద్దు. వారు వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి. 
► వారికి వచ్చే నెల వరకు సమయం ఉంటుంది. అవసరమైతే ఇంకా సమయం ఇస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వెంటనే తనిఖీ ప్రక్రియ కొనసాగుతుంది. వారు అర్హులైతే వచ్చే నెలలో లబ్ధి చేకూరుస్తాం.

విద్యా కానుకతో ప్రయోజనం
► ఆగస్టు 3వ తేదీన స్కూళ్లు తిరిగి తెరిచే రోజు జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులందరికీ కిట్లు అందజేస్తున్నాం. అందులో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్‌ బుక్‌లు, షూస్, సాక్సులు, మూడు జతల యూనిఫామ్‌ ఉంటాయి. వాటి కుట్టుకూలి కూడా ఇస్తాం.
► దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు ఇస్తున్నందు వల్ల సుమారు కోటి ఇరవై లక్షల యూనిఫామ్‌లు కుట్టాల్సి ఉంటుంది. దీని వల్ల దర్జీలకు 
ఎంతో ప్రయోజనం కలగనుంది.
► ఈ కార్యక్రమంలో మంత్రులు ఎం.శంకరనారాయణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పెద్దిరెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, సీఎస్‌ నీలం సాహ్ని, బీసీ సంక్షేమ శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత.. పాదయాత్రలో దృశ్యాలు, ఏలూరు బీసీ గర్జనలో వైఎస్‌ జగన్‌ మాట్లాడిన మాటలు, జగనన్న చేదోడు పథకం గురించి వీడియో ప్రదర్శించారు. 

‘జగనన్న చేదోడు’ అంటే..
రాష్ట్రంలోని రజకులు, నాయీ బ్రాహ్మ ణులు, దర్జీలు 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకం కింద లబ్ధిపొందడానికి అర్హులు. వీరికి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. వృత్తిపరమైన పనిముట్లు, పెట్టుబడి కోసం ఈ మొత్తాన్ని వారు ఉపయోగించుకోవచ్చు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం ప్రారంభమైంది. తద్వారా ఆయా వర్గాలకు ‘నేను విన్నాను. నేను ఉన్నాను’ అంటూ ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు.

పేదల గుండెల్లో దేవుడిలా నిలిచారు
సీఎంతో సంతోషం పంచుకున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు 
‘పేదల గుండెల్లో మీరు (సీఎం జగన్‌) దేవుడిలా నిలిచిపోతారు. మా గురించి పట్టించుకున్న తొలి సీఎం మీరే. మీ రాజ్యం రామరాజ్యం. మీ లాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలి’ అని రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న చేదోడు పథకం ప్రారంభం సందర్భంగా బుధవారం ఆయా జిల్లాల నుంచి వారు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 

మాకు ఇదే పది లక్షలు
నేను 30 ఏళ్లుగా వృత్తిని కొనసాగిస్తూ జీవనం సాగిస్తున్నాను. ఇప్పుడు నాకు 56 ఏళ్లు. కొద్ది రోజుల క్రితం వలంటీర్‌ మా షాపునకు వచ్చాడు. వివరాలన్నీ తీసుకెళ్లిన పది రోజుల తర్వాత జగనన్న చేదోడు పథకం లబ్ధిదారుడిగా ఎంపికయ్యారని చెప్పాడు. ఇన్ని సంవత్సరాల్లో ఈ రకంగా ఎప్పుడూ లబ్ధి పొందలేదు. నాకు ముగ్గురు అమ్మాయిలు. వారి పిల్లలకు కూడా అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బులొచ్చాయి. కరోనా కాలంలో మీరు చేసిన సాయం మరవలేం. ఇప్పుడు ఇచ్చిన  పది వేల రూపాయలు షాప్‌ రెంట్లు, సామాన్లు కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయి. మాకు ఇదే పది లక్షలు. 
– అలజంగి పైడయ్య, నాయీ బ్రాహ్మణుడు, శ్రీకాకుళం
 ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను ఆనందంగా చూపిస్తున్న ఒంగోలు మహిళా టైలర్లు 

మంచి సీఎం అని పేరు తెచ్చుకున్నారు
ఇద్దరు వర్కర్లను పెట్టుకుని టైలరింగ్‌ షాప్‌ ప్రారంభించాను. ఈ రోజు పది వేలు మంజూరు అవ్వడం పట్ల చాలా సంతోషంగా వుంది. అమ్మ ఒడి ద్వారా నేను లబ్ధి పొందాను. మంచి ముఖ్యమంత్రి అని ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మీకు వ్యతిరేకంగా వుండే పార్టీలోని నా స్నేహితులు కూడా ఇప్పుడు మీరు తిరుగులేని విధంగా పాలన సాగిస్తున్నారని మెచ్చుకుంటున్నారు. పేదల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయారు. అన్నా.. మీ రాజ్యం అంతా రామ రాజ్యం. 
– కస్తూరి, టైలర్, చిత్తూరు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top