బాధలు చెప్పొద్దు.. భజన చేయండి! | CM chandrababu meeting to be held in Kurnool district | Sakshi
Sakshi News home page

బాధలు చెప్పొద్దు.. భజన చేయండి!

May 10 2018 10:28 AM | Updated on Jul 28 2018 6:43 PM

CM chandrababu meeting to be held in Kurnool district - Sakshi

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో మధ్యాహ్నం 2.10 నుంచి 4.30 గంటల వరకు ప్రత్యేకహోదా, విభజన హామీలపై ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారిని ఎంపిక చేయడంలో పోలీసు, రెవెన్యూ అధికారులు అతి జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి భజన చేసే విధంగా మాట్లాడాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రశ్నించవద్దని వారికే ముందే సూచించారు. ముఖాముఖికి మొత్తం మూడు వేల మందిని ఎంపిక చేశారు. మేధావులుగా గుర్తించిన వీరిలో సీనియర్‌ సిటిజన్‌లు, టీచర్లు, ఎన్‌జీవోలు, అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజినీర్లు, విద్యార్థులు, మహిళలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీరిని ఎంపిక చేసేందుకు ముందుగా మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులా? నేర చరిత్ర ఏమైనా ఉందా? తదితర కోణాల్లో విచారించారు. పోలీసులు కూడా వివిధ స్థాయిల్లో విచారణ జరిపిన తర్వాతనే గుర్తింపు కార్డులు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట్లాడినా సంబంధిత అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది.  కాగా..సీఎంతో ముఖాముఖికి హాజరయ్యే వారిని తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలపై అధికార యంత్రాంగం తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థులను కూడా తరలించాలని ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం వేసవి సెలవులని చేతులెత్తేయడంతో బస్సులైనా ఏర్పాటు చేయాలని, లేకపోతే ఇబ్బందులు పడతారని బెదిరించినట్లు తెలుస్తోంది.  

సీఎం పర్యటన సాగేదిలా.. 
ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఓర్వకల్లు మండలం పూడిచెర్లకు ఉదయం 10.30 గంటలకు  చేరుకుంటారు. 10.45 నుంచి 11.45 వరకు  జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడే పారిశ్రామికవేత్తలు, మీడియాతో మాట్లాడతారు. 

ఉదయం 11.50 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులకు, రాష్ట్రీయ ఉచ్చర్‌ శిక్షా అభియాన్‌ (రుసా) కింద నిర్మించే క్లస్టర్‌ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు. అక్కడే విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 వరకు భోజన విరామం ఉంటుంది. 

మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రెండు గంటలకు కర్నూలు ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. 2.10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై మేధావులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 4.40 గంటలకు జిల్లా పర్యటన ముగుస్తుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement