హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే

విలేకరుల సమావేశంలోమేకపాటి, గీత - Sakshi


* టీడీపీ అధినేత తీరును తప్పుపట్టిన వైఎస్సార్‌సీపీ

* బలమైన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీని దెబ్బతీయడానికే బాబు పన్నాగం

 

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను ఎలా అమలు చేయాలో తెలియక వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. హామీల అమలును పక్కనబెట్టి ప్రతిపక్ష పార్టీ నేతల వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆయన తీరును ఎండగట్టింది. ఒకవైపు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణానికి కె.చంద్రశేఖర్‌రావు అపాయింటెడ్ డే జూన్ 2నే ముహూర్తంగా పెట్టుకుంటే చంద్రబాబు మాత్రం వెనక్కి వెనక్కి వెళ్తున్నారని విమర్శించింది. వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొత్తపల్లి గీత ఆదివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.‘‘చంద్రబాబు చేయాల్సిన పనులు, ఎన్నికల వాగ్దానాలు చాలా ఉన్నాయి. రైతుల వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామన్నారు. చేనేత రుణాలు మాఫీ అన్నారు. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు.. వికలాంగులకు రూ. 1,500 పింఛన్ ఇస్తామన్నారు. వీటన్నింటి అమలు గురించి ప్రజలు ఎదురు చూస్తున్న సమయంలో చంద్రబాబు వాటిపై దృష్టి పెట్టకుండా... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలనో, ఎంపీలనో టీడీపీలోకి ఎలా లాక్కుందామనే అనైతిక చర్యలు మొదలుపెట్టారు’’ అని మేకపాటి విమర్శించారు.‘‘చంద్రబాబు.. మీరు మొదట ఎన్నికల వాగ్దానాలు ఎలా నేరవేర్చాలో ఆలోచించండి. వ్యవసాయ పనుల సీజను మొదలవుతోంది. రైతులు రుణమాఫీ జరిగి కొత్త రుణాలు వస్తాయని ఎదురుచూస్తున్నారు. పెన్షన్ కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆశగా చూస్తున్నారు’’ అని హితవు పలికారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న పన్నాగంతో చంద్రబాబు పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం లేకుండా చేద్దామని ఆయన అనుకుంటే అది జరిగే పనికాదని హెచ్చరించారు.

 

పార్టీ మారేవారిపై వేటు తప్పదు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరితే ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. ఈ విషయాన్నీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పిందన్నారు.  టీడీపీ నేతలు ఏం మభ్య పెట్టారో తెలియదుగానీ ఇద్దరు ఎంపీలు పార్టీ మా రారని తెలుస్తుందన్నారు. ఈ పార్టీలో గెలిచి ఆ తడి ఇంకా ఆరకముందే పార్టీ ఫిరాయిం చడమంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో కళ్లకు కడుతుందన్నారు. అయితే తాను గతంలో కాంగ్రెస్‌లో గెలిచినా ఆ పార్టీకి రాజీనామా చేసిన తరువాతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని గుర్తు చేశారు.  

 

నేను జగన్ వెంటే

జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తాను వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉంటానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపోటములు సహజమేనన్నారు. తాను పార్టీ మారతాననే ప్రచారం కేవలం ఉహాగానాలేనని కొట్టిపారేశారు. అలాంటి ఆలోచన కానీ, అవసరం కానీ తనకు లేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top