తోకలు కట్ చేస్తా | Chandrababu Naidu activists expressed resentment | Sakshi
Sakshi News home page

తోకలు కట్ చేస్తా

Feb 17 2014 2:14 AM | Updated on Aug 10 2018 8:01 PM

‘నేను చెప్పిందే మీరు వినాలి.. కార్యకర్తలు ఇంట్లో పడుకుంటే పార్టీ గెలుస్తుందా.. ఏం చేసైనా పార్టీని బతికించాలి.. త్యాగాలకు సిద్ధంగా ఉండండి..

 పెంటపాడు, న్యూస్‌లైన్: ‘నేను చెప్పిందే మీరు వినాలి.. కార్యకర్తలు ఇంట్లో పడుకుంటే పార్టీ గెలుస్తుందా.. ఏం చేసైనా పార్టీని బతికించాలి.. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.. నా ముందే కుప్పిగంతులు వేస్తారా.. మీ తోకలు కట్ చేస్తా.. ’ అంటూ టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి సీఈవోగా వ్యవహరించానంటూ పదేపదే చెప్పుకున్న చంద్రబాబు వైఖరి ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ అధికారంలోనే కొనసాగుతున్నట్టుగా నేతలు, కార్యకర్తలపై కస్సుబుస్సులాడారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ ప్రజాగర్జన అనంతరం ఆదివారం అర్ధరాత్రి వరకు స్థానిక శశి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశంలో చంద్రబాబు పైవిధంగా మాట్లాడారు.
 
 నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై సమీక్షించిన ఆయన అడుగడుగునా కార్యకర్తలకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. పాలకొల్లు, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల సమీక్ష సందర్భంలో కొందరు కార్యకర్తలు నిలబడి నాయకులు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమీ బాగోలేదని, సమైక్యాంధ్ర అంశంపై పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పాలని ప్రజలు అడుగుతున్నారని అధినేతకు నివేదించారు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ‘మీ సంగతి తెలుసు.. నాముం దే కుప్పిగంతులా.. తోకలు కట్‌చేస్తా.. నాతో మైండ్‌గేమ్ ఆడతారా’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీ మేనేజర్లు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిరంతరం పార్టీకోసం కష్టపడుతున్నట్టే ప్రతి కార్యకర్త కష్టపడాలన్నారు. ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. 
 
 కాంగ్రెస్ ఖాళీ అయ్యింది
 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆ పార్టీ నుంచి వచ్చేవారిని టీడీపీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే మన ఉనికికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఏలూరు కు చెందిన బడేటి బుజ్జి మాట్లాడుతూ  బూత్‌స్థాయి కమిటీల ద్వారా ప్రజలను కలుసుకొని  టీడీపీ ప్రచార కార్యక్రమాలు వివరిస్తున్నట్లు తెలిపారు. తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జి అరిమిల్లి రాధాకృష్ణ పార్టీ పరిస్థితిని చంద్రబాబుకు వివరించారు. 
 
 తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు వేగవంతం కాలేదని, ప్రజాగర్జన ఏర్పాట్లు చేయడం వల్ల ప్రచారంలో ఆలస్యమైందని చెప్పారు. తాడేపల్లిగూడెం సీటును బాపిరాజుకు ఇస్తున్నట్టు ప్రకటన చేస్తారేమోనని నాయకులు, కార్యకర్తలు ఎదురుచూడగా,  బాబు ఆ ప్రస్తావనే చేయకపోవడంతో వారంతా నీరసించారు. ఆచంట, భీమవరం, ఉండి నియోజక వర్గాల నుంచి కార్యకర్తలు ఎంతమంది వచ్చారు చేతులెత్తమని చంద్రబాబు కోరగా, పదుల సంఖ్యలో చేతులెత్తారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, మేనేజర్లతో తప్ప చంద్రబాబు సామాన్య కార్యకర్తలతో మాట్లాడకపోవడంతో నిరాశ చెందారు. సమీక్షలో రాజ్యసభకు ఎంపికైన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, చింతమనేని ప్రభాకర్, కలవపూడి శివ, టీవీ రామారావు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement