
ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈఈ
ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఏఈఈ రూ.15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ
రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
తిరుపతి క్రైం: ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఏఈఈ రూ.15 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఎసీబీ డీఎస్పీ శంకర్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఎర్రావారిపాళెం మండలం చింతగుంటకు చెందిన మురళీ మోహన్ ప్రభుత్వం వద్దనుంచి చెరువుల్లో పూడిక తీసే పనులకు కాంట్రాక్టు పొందాడు. ఈ పనులకు సంబంధించి రూ. ఒక లక్షా నాలుగు వేలకు బిల్లులు పెట్టాడు. ఆ బిల్లులు చెల్లించాలంటే రూ.21 వేల లంచం ఇవ్వాలని ఇరిగేషన్ ఏఈఈ గిరిబాబు డిమాండ్ చేశాడు.
తాను కోరిన మొత్తం ఇవ్వకుంటే కాంట్రాక్టు రానివ్వకుంటా చేస్తానని బెదిరించాడు. దీంతో మురళీ మోహన్ ఏఈఈకి మొదట రూ.6 వేలు ఇచ్చాడు. రెండు రోజుల క్రితం కాంట్రాక్టు బిల్లు పాసై మురళీమోహన్ అకౌంట్‌లో జమైంది. అప్పటి నుంచి మిగిలిన రూ.15వేలు ఇవ్వాలని ఏఈఈ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితుడు తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం తిరుపతిలోని బాలాజీ కాలనీ వద్ద ఏఈఈకి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.