పుర పోరులో రాజకీయ స్తబ్ధత నెలకొంది. నామినేషన్ల అంకానికి తెరలేచి రెండు రోజులు గడిచినా.. ఇంకా అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరావడంలేదు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పుర పోరులో రాజకీయ స్తబ్ధత నెలకొంది. నామినేషన్ల అంకానికి తెరలేచి రెండు రోజులు గడిచినా.. ఇంకా అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరావడంలేదు. అన్ని రాజకీయ పార్టీలూ పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా.. లోపల ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటివరకు ఏ ఒక్కపార్టీ కూడా ముందుకొచ్చి తమ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిని, కనీసం కౌన్సిలర్ల పేర్లను కూడా ప్రకటించక పోవడం గమనార్హం.
ఒక్కొక్క స్థానంలో పోటీ చేసేందుకు అభ్యర్థులు గుంపులు, గుంపులుగా వస్తుండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అన్ని పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. గడువు నెత్తిమీదకు వచ్చే వరకు వేచి చూసి..చివరి నిమిషంలో హడావుడిగా టికెట్ల పంపిణీ చేసి ఆ తరువాత బుజ్జగింపులకు దిగితే ఫలితం ఉంటుందని నేతలు భావిస్తున్నట్టు సమాచారం.
‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్లు మున్సిపల్ కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యే ఆశావహుల చావుకొచ్చింది. అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న నేతలకు మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించిన వారికే దాదాపు టికెట్ ఖరారు కానుండటం.. గెలిచిన కౌన్సిలర్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నవారు ఈ ఎన్నికలను తమ భుజాల మీద వేసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి డబ్బులు ఖర్చు చేసే వరకు అన్ని వారే చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎలాగూ ఖర్చు లేదని కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. దీంతో తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఒక వార్డుకు ప్రతి పార్టీ నుంచి కనీసం నాలుగు నుంచి ఎనిమిది మంది వరకు పోటీ పడుతున్నారు.
వీరంతా తమ సొంత పలుకుబడినో.. కుల ప్రాతిపదికనో.. పార్టీలో జెండా మోసిన సీనియార్టినో చూపించి టికెట్లు అడుగుతున్నారు. కచ్చితంగా టికెట్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. లేదంటే ‘ముందు ముందు’ మేమేంటో చూపిస్తామని బెదిరిస్తున్నట్టు వినికిడి.
అభ్యర్థులను ఒప్పించి, మెప్పించి టికెట్ల సర్దుబాటు చేసేందుకు నేతలు రహాస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. అయినా అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరావడం లేదని తెలుస్తోంది. ఒకరిని ఒప్పిస్తే మరో ఇద్దరు లేచి నిలబడి మా పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నట్టు సమాచారం. ఇలాంటి సందర్భంలో ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు ఎన్నికల్లో వారు ప్రత్యర్థి శిబిరంలోకి చేరే ప్రమాదం ఉందని నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రెబల్స్ బెడదను నివారించేందుకే అభ్యర్థుల ఎంపికలో పార్టీలు కావాలనే జాప్యం చేస్తున్నట్లు సమాచారం.