అందరినోట లాక్‌డౌన్‌ మాట..

Callers Suggest to Lockdown Again Phone in Collector Programme - Sakshi

జిల్లాలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా

832కి  చేరిన పాజిటివ్‌ కేసులు

114కు పెరిగిన కంటైన్మైంట్‌ క్లస్టర్లు

పోలీస్‌ విభాగంలో 37 మందికి కరోనా

వ్యాధి సోకిన వారిపై వివక్ష చూపిస్తున్న ప్రజలు

కొన్నిచోట్ల కుటుంబాలను వెలివేస్తున్న వైనం

కరోనా కట్టడికి ఫోన్‌ఇన్‌లో ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన కలెక్టర్, ఎస్పీ  

కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఫోన్‌ చేసిన 80 మంది సూచన  

కరోనా జిల్లా వాసులను కలవరపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.కరోనా నియంత్రణ విధులు నిర్వహించే పోలీస్‌ విభాగంలోనూ కలకలం సృష్టిస్తోంది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కరోనా కట్టడికి ఏం చేద్దామంటూ కలెక్టర్, ఎస్పీలు ‘ఫోన్‌ఇన్‌’ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలు స్వీకరించారు.అధికమంది లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలంటూ సలహా ఇచ్చారు.   

సాక్షి ప్రతినిధి, విజయనగరం: కరోనా మహమ్మారి జిల్లాలో వేగంగా వ్యాపిస్తోంది. ఆదివారం నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 832కి చేరింది. దీంతో జిల్లా వ్యా ప్తంగా 144 కంటైన్మైంట్‌ క్లస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్క పోలీస్‌ విభాగంలో నే ఇప్పటివరకు  దా దాపు 37 మంది కోవిడ్‌–19 భారిన పడ్డారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాన్యులు అనే తేడా లేకుండా కరోనా ఎవరినీ విడిచిపెట్టడం లేదు. త మ ఇంటి పక్కనో, తమ గ్రామంలోనో, తమ వీధిలోనో కరోనా పాజిటివ్‌ పేషెంట్‌ ఉంటే వారి పట్ల కొందరు వివక్ష చూపిస్తున్నారు. కొన్నిచోట్ల సామాజికంగానూ, భౌతికంగానూ వారిని వెలివేస్తున్నారు.

సమస్యగా మారిన వైరస్‌ వ్యాప్తి...  
దాదాపు 48 రోజుల పాటు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకాకుండా కట్టడి చేయగలిగిన జిల్లా యంత్రాంగం.. ఇప్పుడున్న పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలలుపట్టుకుంటోంది. ఆలోచనలో పడింది. సామాజిక వ్యాప్తి చెందుతున్నకరోనాను అడ్డుకోవడానికి ఏం చేయాలనే దానిపైన ప్రజలనే నేరుగా అడగాలని నిర్ణయించింది.  కలెక్టరేట్‌లో కోవిడ్‌–19 పై ఆదివారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉద యం 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 80 మంది కరోనా కట్టడికి తమ సలహాలు, సూచనలను అందజేశారు. సమస్యలను తెలియజేశారు.  ఫోన్‌ కాల్స్‌ను కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్పీ బి.రాజకుమారి స్వీకరించారు. 

లాక్‌డౌన్‌తోనే కరోనా కట్టడి...  
జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకి ఎక్కువ అవుతున్నందున కనీసం 14 రోజుల నుంచి 30 రోజుల వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని ఎక్కువమంది విన్నవించారు. రైతు బజార్ల వద్ద, మార్కెట్లలో, నిత్యావసర సరుకులు కొనుగోలు దగ్గర  భౌతిక దూరాన్ని పాటించడం లేదని తెలిపారు. మద్యం దుకాణాల వద్ద గుంపులు, గుంపులుగా ఉంటున్నారని, మాస్క్‌లు వినియోగించడం లేదని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపారస్తుల దుకాణాలను మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంచాలని, తదుపరి షాపులు మూసివేయించాలని కోరారు.  కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని త్వరగా ఫలితాలు కూడా తెలియజేయాలని కొంతమంది విజ్ఞప్తి చేశారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై విస్తృతంగా ప్రచారం చేసి అవగాహన కలిగించాలని కొందరు కోరారు. పాజిటివ్‌ వచ్చిన వారిని తరలించేందుకు పోలీసులు, అంబులెన్స్‌లు రావడంతో ఆ కుటుంబ సభ్యులు అవమానకరంగా భావిస్తున్నారని, దీనికి ప్రత్యామ్నాయం చూడాలని కొంతమంది తెలిపారు. మార్కెట్లలో బ్లీచింగ్, శానిటేషన్‌ ప్రతిరోజు చేయాలని, ప్రతిషాపు వద్ద శానిటైజర్లను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కోవిడ్‌ కాల్‌ సెంటర్‌/టోల్‌ ఫ్రీ నంబర్లను ప్రదర్శించాలన్నారు. ఆర్‌ అండ్‌బీ రైతు బజారులో వినియోగదారులు అధికంగా వస్తున్నందున అలకానంద కాలనీలో ఉన్న పార్కులోనికి బజారు తరలించాలన్నారు.  

జిల్లాకు బయట నుంచి వచ్చే వారిని కట్టడి చేయాలని ఓ ఫోన్‌కాలర్‌ తెలిపారు. దివ్యాంగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశం కల్పించాలని కోరారు. కరోనా నివారణకు కొన్ని చిట్కాలు పాటించాలని, వేడి నీరు తాగటం, ఆవిరి పట్టడం, పౌష్టి కాహారాన్ని తీసుకోవాలని పీడబ్ల్యూడీ మార్కెట్‌ నుంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి సలహా ఇచ్చారు. భౌతిక దూ రాన్ని పాటించేలా మార్కెట్ల వద్ద పోలీస్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులను నియమించాలన్నారు. ప్రజలలో భయం పోయి విచ్చలవిడిగా అనవసరంగా తిరుగుతున్నారని, కఠినంగా వ్యవహారించకపోతే కరోనా కట్టడి కష్టమని అనేకమంది అభిప్రాయపడ్డారు. స్వీకరించిన ఫోన్‌ కాల్స్‌ వివరాలను సంబంధిత శాఖలకు పంపిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ విషయమై జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.  ప్రజాభిప్రాయం మేరకు 15 రోజుల పాటు జిల్లా లో లాక్‌డౌన్‌ విధించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. దీనిని రెండుమూడు రోజుల్లో ప్రకటించనున్నారు.  

రికార్డు స్థాయిలో కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో ఆదివారం ఒక్కరోజు 144 కేసులు నమోదయ్యాయి. విజయనగరం పట్టణంలోని సూర్య లాడ్జి దగ్గర, కొత్త ఆగ్రహారం, అయ్యన్నపేట, పడాల వీధి, కోటగండ్రేడు, దాస న్నపేట రైతు బజార్, రైల్వే న్యూ కాలనీ, దేవీనగర్‌లలో కేసులు బయటపడ్డా యి. అలాగే, గాజులరేగ పాతవీధి, ఎత్తుబ్రిడ్జి, కొత్త ధర్మ పురి, చింతవలస బెటాలియన్, కంటోన్మెంట్, అంబేడ్క ర్‌ కాలనీ, విజయనగరం పట్టణంలోని చిన్నవీధి, ఉడా కాలనీ, కణపాక, బూడి వీధి, ధర్మపురి పెద్దవీధి, గరివి డి ఈహెచ్‌కాలనీ, సాయినగర్, కాళీఘాట్‌కాలనీ, పూల్‌బాగ్‌ కాలనీ, కణపాక ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. జామి మండలం రొట్లపల్లి, అలమండ సంత, బొబ్బిలి మండలంలోని ముత్తాయివలస, సాలురు పట్టణంలోని చింతల వీధి, ఎస్‌బీఐ దగ్గర, 16వ వార్డు, పార్వతీపురం మండలంలోని పాపమ్మవలస, రంగాల వీధి, అయ్యన్న కోనేరు గట్టు, ఉడా కాలనీ, కె.ఎల్‌.పురం, లలితనగర్, నెల్లిమర్ల మండలం చంద్రంపేట, పూసపాటి రేగ మండలం చింతపల్లి, ఎస్‌.కోట మండలం బొడ్డవర, చీపురపల్లిలో కరోనా అలజడి నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top