కాకినాడలో వ్యాపారి కిడ్నాప్ | Businessman kidnapped in Kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో వ్యాపారి కిడ్నాప్

Dec 28 2013 2:43 AM | Updated on Sep 2 2017 2:01 AM

నగరంలో గురువారం రాత్రి కలకలం రేకెత్తించిన వ్యాపారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. అయితే పోలీసులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కిడ్నాప్

బాలాజీచెరువు (కాకినాడ), న్యూస్‌లైన్ : నగరంలో గురువారం రాత్రి కలకలం రేకెత్తించిన వ్యాపారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. అయితే పోలీసులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కిడ్నాప్ కేసుగా కాక మిస్సింగ్ కేసుగా నమోదు చేశారని బాధితుని బంధువులు ఆరోస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 
 
 రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుడు గోవిందు తన కుమారుడు విక్కీ కుమార్‌జైన్‌ను కిడ్నాప్ చేశాడంటూ నగరానికి చెందిన  వస్త్రవ్యాపారి సోహలాల్‌జైన్ శుక్రవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సోహలాల్‌జైన్, అతని సోదరుని కుమారుడు సంజయ్‌కుమార్ విలేకరులకు చెప్పిన వివరాల ప్రకారం.. తిలక్ వీధిలో మోడల్స్ మెన్స్‌వేర్ వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న విక్కీ గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సేల్స్‌మేన్ కామేష్‌తో కలిసి బాలాజీ చెరువు సెంటర్‌కు టిఫిన్ చెయ్యడానికి వెళ్లాడు. అదే సమయంలో ఏపీ5బీడబ్లూ 369 నంబరు కలిగిన తెల్ల కారులో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి విక్కీని బలవంతంగా కారులోకి ఎక్కించుకు తీసుకుపోయారు. విషయం తెల్సి రాత్రంతా గాలించినా ఎక్కడా విక్కీ ఆచూకీ దొరకలేదు.
 
 శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే సోదరుడు గోవిందు ఫోన్ చేసి విక్కీ తన వద్ద క్షేమంగా ఉన్నాడని, తనకివ్వాల్సిన బాకీ కోసమే కిడ్నాప్ చేశానని చెప్పాడు. బాకీకి సంబంధించి ప్రామిసరీ నోట్లు ఉన్నట్టు పేర్కొన్నాడు. నిజానికి  తాము బాకీ ఎనిమిదేళ్ల క్రితమే తీర్చేశామని, ఇప్పుడు మళ్లీ కొత్తగా బాకీ ఉందంటూ తన కుమారుడిని కిడ్నాప్ చెయ్యడం దారుణమని సోహలాల్ జైన్ అన్నారు. తన కుమారుడిని పోలీసులు   క్షేమంగా అప్పగించాలని కోరారు. కాగా కిడ్నాప్ విషయం టీవీ చానళ్లలో రావడంతో.. విక్కీని ఎత్తుకు వెళ్లిన వారే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాకినాడ తీసుకువచ్చి వదిలారు. పోలీసులు మిస్సింగ్ కేసును రద్దు చేశారు. ఏదేమైనా కుమారుడు కిడ్నాప్ అయినట్టు తండ్రి ఫిర్యాదు ఇస్తే మిస్సింగు కేసుగా నమోదు చేసిన పోలీసుల వైఖరిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement