నిజాయితీతో సేవలందించండి 

Buggana Rajendranath Reddy speech In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన ఉద్యోగులు నిజాయితీ, పారదర్శకంగా, చిరునవ్వుతో ప్రజలకు సేవలు అందించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కోరారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్‌ ఎస్‌ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, తొగూరు ఆర్థర్, జిల్లా కలెక్టర్‌ జీ వీరపాండియన్, జిల్లా ఎస్‌పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ రవిపట్టన్‌ శెట్టి, జెడ్పీ సీఈఓ డాక్టర్‌ సీహెచ్‌ పుల్లారెడ్డి, డీపీఓ కేఎల్‌ ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బీవై రామయ్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకోసం నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో  లక్షల్లో ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశా మన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య పాలనే లక్ష్యంగా ఈ నెల 2వ తేదీన గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.27 లక్షల కొత్త ఉద్యోగాలను రికార్డు సమయంలో కేవలం మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా నంబర్‌1గా ఉందన్నారు.  100 రోజుల్లోనే లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశారని మంత్రి బుగ్గన చెప్పారు.  

బడా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం వల్లే నేడు జీతాలకు ఇబ్బందులు ... 
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బడా కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం వల్లే నేడు జీతాలకు ఇబ్బంది పరిస్థితి నెలకొనిందని మంత్రి బుగ్గన ఆన్నారు. 2019 జనవరి నెల నుంచి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పటి ముఖ్యమంత్రి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు తదితర సేవా రంగాలకు చెందిన పద్దులన్నింటిని తమ అనునాయులైన బడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించారన్నారు. అందువల్లే తొమ్మిది నెలలుగా ఆయా రంగాల్లోని వారికి జీతాలు పెండింగ్‌లో పడ్డాయన్నారు. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నాటి పాలకుల చేపట్టిన చర్యలు కారణంగానే నేడు విద్యుత్‌ సమస్యలు కూడా తలెత్తాయని, ఈ సమస్యలను త్వరలోనే అధిగమిస్తామన్నారు.    

భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రెవెన్యూ చట్టం ... 
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చారని మంత్రి బుగ్గన చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, స్వచ్ఛీకరణ చేపట్టారన్నారు. ఒక సెంటు భూమి కూడా తేడా లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకు గ్రామ సచివాలయాల్లో నియమితులవుతున్న వీఆర్‌ఓ, సర్వేయర్లు నిజాయితీగా కృషి చేయాల్సి ఉందన్నారు.  

నాడు చదువు ... నేడు ఉద్యోగం 
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందించేందుకు ఫీజు రీయంయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని బుగ్గన్న అన్నారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు.  2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు వైఎస్సార్‌ తనయుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన 

ఉద్వేగ భరితం.. 
వస్తుందో రాదో అనుకున్న ఉద్యోగం వరించడంతో ఓ యువతి ఉద్వేగానికి గురయ్యారు. నయాపైసా ఖర్చు లేకుండా.. ఎలాంటి రెకమెండేషన్‌ లేకుండా.. గ్రామ సచివాలయ కొలువు రావడంతో ఆనంద బాష్పాలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘ మాది మిడుతూరు మండలం తలముడిపి గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాను. అవ్వాతాతల వద్ద పెరిగాను. దాతల సహకారంతో చదువుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సమయంలో ఎలాంటి రాజకీయ పలుకుబడి, డబ్బులేని లేని నాలాంటి వాళ్లకు ఉద్యోగాల వస్తాయో రావో అనే ఆందోళన ఉండేది. డబ్బు ఖర్చు లేకుండా, సిఫార్సులు లేకుండా, కష్టపడి చదివి నేను విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాను. చాలా ఆనందంగా ఉంది.’’ అని ఆమె అన్నారు. ఈ యువతిని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్‌ ప్రత్యేకంగా అభినందించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆత్మస్థైర్యం, పట్టుదలతో విద్యలో రాణించి సచివాలయ పోస్టులో జిల్లాలో మహిళా విభాగంలో టాపర్‌గా నిల్వడం హర్షదాయకమన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top