
కలసి పని చేయండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్తగా కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు
చంద్రబాబు, కేసీఆర్‌కు కేంద్ర మంత్రి వెంకయ్య సూచన
సీఎంలు కరచాలనం చేసుకోవటం పెద్ద వార్తగా ఎందుకైంది?
దీనికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి?
అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరినీ కోరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు పరస్పరం కరచాలనం చేసుకోవటం పెద్ద వార్తగా కావటంపై వారిద్దరూ ఆలోచన చేసుకుంటే మంచిదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇద్దరు ముఖ్యమంత్రులు కరచాలనం చేసుకోవడం పెద్ద వార్త కాకూడదు. కానీ అయింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై వారే ఆలోచించాలి. విభేదాలుంటే వాటిని పక్కన పెట్టి కలిసి పనిచేయాలన్నది నా ఆకాంక్ష. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఇద్దరు ముఖ్యమంత్రులకూ సూచించా. పాటిస్తారో లేదో వారి ఇష్టం’ అని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 1956 స్థానికత నిబంధనపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి చట్టం
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు వెంకయ్యనాయుడు ప్రకటించారు. బిల్డర్ నుంచి ఇళ్లను కొనుగోలు చేసేవారికి ఎక్కువ ప్రయోజనం కలిగించేలా, రియల్ ఎస్టేట్ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేలా బిల్లు ఉంటుందన్నారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తోపాటు క్రెడాయ్ లాంటి సంస్థలతోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి వచ్చే అవకాశం ఉందన్నారు.