గత ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్నినిర్వీర్యం చేసింది: పెద్దిరెడ్డి

Balineni Srinivasareddy And Peddireddy Ramachandra Reddy Talks In Vijayawada Programme - Sakshi

సాక్షి, విజయవాడ: విద్యుత్‌ వినియోగం తగ్గించడం, పొదుపు చేయడాన్ని మహిళలు నేర్చుకోవాలని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వయం సహాయక బృందాల మహిళలకు ఇంధన పొదుపుపై అవగాహన సదస్సును సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, నాగులాపల్లి శ్రీకాంత్‌, ఎనర్జీ డిపార్ట్‌మెంటు కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. స్టార్‌ రేటింగ్స్‌ ఎక్కువగా ఉన్న ఉత్పత్తులను వాడి విద్యుత్‌ను పొదుపు చేయాలని సూచించారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి యూనిట్‌ విద్యుత్‌ను గతంలో కంటే తక్కువ ధరకు కొని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

విద్యుత్ కొనుగోలులో 5 నెలల్లో ప్రభుత్వం రూ. 500 కోట్లు ఆదా చేసిందని, బొగ్గు కొనుగోలు టెండర్లలో రివర్స్ టెండరింగ్ ద్వారా 180కోట్లు ఆదా చేశామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని, విద్యుత్ శాఖ వేల కోట్ల రూపాయల నష్టంలో ఉందని మంత్రి బాలినేని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. అలాగే డ్వాక్రా రుణమాఫీని త్వరలో అమలు చేయనున్నామని, పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంధనం లేకపోతే ఏ రంగం అభివృద్ధి చెందదని, అందుకే విద్యుత్‌ను పొదుపుగా వాడాలన్నారు. రాష్ట్రం 70వేల కోట్ల రూపాయల అప్పులో ఉందని, చంద్రబాబు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టారని, ఇక ఆర్థిక భారాన్ని సీఎం జగన్‌పై పెట్టారని మంత్రి వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ పదవి చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని, గ్రామాల్లో ఈఎస్‌ఎల్‌ అనే సంస్థ ద్వారా ఎల్‌ఈడీ లైట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల్లో రూ.5 లక్షలతో వీధి దీపాలు ఏర్పాటు చేశామని, డ్వాక్రా సంఘాలకు ఈ ఏడాది రూ. 8540 కోట్లు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చామని వెల్లడించారు.

సంఘాలకు రూ. 1137.57 కోట్లు రుణాల కింద అందజేశామని, దేశ చరిత్రలోనే మొదటిసారిగా గ్రామ సచివాలయం, గ్రామవాలంటీర్‌ల వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణాభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం జగన్‌ అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1200 కోట్ల రూపాయలు చెల్లించి బాధితులను ఆదుకున్నారని, ప్రభుత్వ పాఠశాలను ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద మరింతగా అభివృద్ధి చేశామని ఆయన తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పేద విద్యార్థులకు చదువు నిమిత్తం ఏడాదికి రూ. 15000 అందిస్తున్నామని, జనవరి 7నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top