బాబు హామీలు 0/20

బాబు హామీలు 0/20 - Sakshi


ఇరవైకి సున్నా..! ఇది ఏదో పరీక్షలో విద్యార్థికి వచ్చిన మార్కులేమో అనుకుంటే పొరపాటే! ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్నెళ్లలో ఇచ్చిన ప్రధానమైన 20 హామీల్లో ఏ ఒక్క హామీని అమలుచేయలేదు. రైతు రుణవిముక్తి పథకాన్ని ప్రారంభించేందుకు.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) దక్షిణ భారత సదస్సును ప్రారంభించేందుకు జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన హామీల అమలు తీరును ఒక్కసారి పరిశీలిస్తే..* ఆరు నెలల్లో ఏ ఒక్క హామీ అమలు చేయని సీఎం

* కాగితాలకే పరిమితమైన వరాలు

* కార్యరూపం దాల్చేదెన్నడో మరి!


సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు వందకుపైగా హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వాటిని ఒకటి వెనుక మరొకటి అటకెక్కిస్తోన్న చంద్రబాబు.. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక జిల్లాకు ఇచ్చిన హామీలను సైతం బుట్టదాఖలు చేస్తున్నారు.  శాసనసభలో సెప్టెంబర్ 4న జిల్లాలపై వరాల వర్షం కురిపించారు. నవంబర్ 5న జన్మభూమి-మా ఊరులో భాగంగా బి.కొత్తకోట మండలం అంగళ్లులో పర్యటించినప్పుడు హామీల మీద హామీలిచ్చారు. కానీ.. చేతల్లోకి వచ్చేసరికి ఏ ఒక్క హామీని అమలుచేయ లేదు.ప్రధాన హామీల పరిస్థితి ఇదీ..

1.తిరుపతిలో ఐఐటీ: మేర్లపాక వద్ద ఐఐటీ ఏర్పాటుకు 450 ఎకరాల భూమిని అధికారు లు గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. అధికారుల బృందం రెండుసార్లు ఆ భూమిని పరిశీలించి ఆమోదం తెలిపింది. వచ్చే విద్యాసంవత్సరం ప్రైవేటు భవనాల్లో తరగతులు ప్రారంభిస్తామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఇప్పటిదాకా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు    

 

2. తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్: ఏర్పేడు మండ లం మేర్లపాక వద్ద ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు 354 ఎకరాల భూమిని గుర్తించి.. ప్రభుత్వానికి నివేదించారు. కేంద్ర మానవనరులశాఖ బృందం ఆ భూమిని పరిశీలించింది. ఆ సంస్థ ఏర్పాటుకు ఇప్పటిదాకా కేంద్రం నిధులు కేటాయించలేదు. ఎప్పటిలోగా ఏర్పాటుచేస్తారో స్పష్టత లేదు.    

 

3. సెంట్రల్ యూనివర్సిటీ : ఆదిలోనే ఈ హా మీని తుంగలోతొక్కారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురం జిల్లాకు తరలించారు.4. తిరుపతిని మెగాసిటీగా: రంగంపేటకు సమీపంలోని అటవీ భూములను డీ-నోటిఫై చేసి తిరుపతిని మెగాసిటీ ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు.    5. తిరుపతిలో ఐటీఐఆర్ : తిరుపతిలో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తామని ఒకసారి.. ఐటీ హబ్‌గా ఏర్పాటుచేస్తామని మరొకసారి చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండు నెలల క్రితం ప్రభుత్వం విడుదల చేసిన ఐటీ విధానంలో జిల్లా ప్రస్తావన లేకపోవడం గమనార్హం. అంటే.. ఐటీఐఆర్ లేదా ఐటీ హబ్ అన్నది ఇప్పటిదాకా కేవలం మాటలకే పరిమితమైందన్న మాట.    

 

6. అంతర్జాతీయ విమానాశ్రయం: రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించే పనులకు సెప్టెంబర్ 26, 2010న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ హోదా కల్పించే పను లు ఇప్పుడిప్పుడు ఒక కొలిక్కి వస్తున్నాయి. కానీ.. సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆ విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా అభివృద్ధి చేసే ప్రతిపాదన కేంద్రానికి వెళ్లకపోవడం గమనార్హం.

 

7. కుప్పంలో విమానాశ్రయం : కుప్పంలో సెప్టెంబర్‌లో పర్యటించిన ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఐఏ) చైర్మన్ అలోక్ సిన్హా ఎయిర్‌పోర్టు ఏర్పాటుచేయలేమని స్పష్టీ కరించారు. అవసరమైతే ఎయిర్ స్ట్రిప్‌ను ఏర్పాటు చేయవచ్చునని ప్రతిపాదించడం గమనార్హం. దీనిపై కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.    

 

8. ఏర్పేడులో ఎన్‌ఐఎంజెడ్: 2008లోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి-ఏర్పేడు మధ్యన నిమ్జ్(నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మానుపాక్చరింగ్ జోన్) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. చెన్నై-వైజాగ్ పారిశ్రామిక కారిడార్‌లో నిమ్జ్‌కు స్థానం కల్పించారు. నిమ్జ్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను అప్పట్లోనే ఆసియా అభివృద్ధి బ్యాంకుకు అప్పగించారు. ఇటీవల ఏడీబీ అధికార బృందం చంద్రబాబుతో సమావేశమై.. నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గం, నీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలను కల్పిస్తే నిమ్జ్ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పారు. కానీ.. సీఎం నుంచి స్పందన లేదు.

 

9. తిరుపతిలో మెట్రో రైల్ ప్రాజెక్టు : వైజాగ్, వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి)లో మెట్రో రైల్ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల్లో తిరుపతి ప్రస్తావన లేదు. ఇటీవల తిరుపతిలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను సలహాదారు శ్రీధరన్‌కు అప్పగించారు. ఇప్పటిదాకా శ్రీధరన్ తిరుపతిలో పర్యటించలేదు.    

 

10. జిల్లాలో హార్టికల్చర్ హబ్: ఇదే హామీని నవంబర్ 5న మరోసారి చంద్రబాబు ఇచ్చా రు. ఇప్పటిదాకా ఆ హామీ అమలుకు ఎలాం టి చర్యలూ తీసుకోలేదు.    

 

11. కేంద్రం సాయంతో మెగా ఫుడ్‌పార్క్‌లు: ఆ ప్రతిపాదన కేంద్రానికి వెళ్ల లేదు.    

 

12. ఆధ్యాత్మిక కారిడార్:  తిరుపతి-శ్రీకాళహస్తి-కాణిపాకం ఆధ్యాత్మిక కారిడార్ చేస్తామన్నది ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు.

 

13. డీఆర్‌డీవో లేబొరేటరీ : శ్రీరంగరాజపురం మండలం కొక్కిరాలకొండ వద్ద 1101 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికి రెండుసార్లు ఆ భూమిని పరిశీలించారు. వైఎస్సార్ జిల్లా, కర్నూలు జిల్లాలోనూ ఆ సంస్థ ప్రతినిధులు భూమిని పరిశీలించారు. ఆ సంస్థను ఎక్కడ ఏర్పాటుచేస్తారో అంతుచిక్కడం లేదు.    

 

14. హీరో మోటార్స్ పరిశ్రమ : జిల్లాలో రూ.1600 కోట్ల వ్యయంతో మోటారు వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుచేయడానికి హీరో మెటో కార్ప్ సంస్థ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆ సంస్థకు సత్యవేడు మండలం మాదన్నపాలెం వద్ద ఏపీఐఐసీకి చెందిన 634 ఎకరాలను కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ భూమికి ఎకరానికి రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారం ఇస్తేనే అంగీకరిస్తామని రైతులు స్పష్టీకరిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.1.6 లక్షలకు మించి ఇచ్చేది లేదని మొండికేస్తోంది. దీంతో హీరో పరిశ్రమ ఏర్పాటులో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 

15.హంద్రీ-నీవా రెండోదశ వచ్చే ఏడాదికి పూర్తి : హంద్రీ-నీవా ప్రాజెక్టును ఓ కొలిక్కి తేవాలంటే 2015-16లో రూ.2,500 కోట్లు కేటాయించాలని ఇటీవల త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. 2014-15 బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.వంద కోట్లే కేటాయించిన నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో రూ.2,500 కోట్లు ఎలా కేటాయిస్తుందని అధికారవర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

 

16. టమాట రైతుల రుణమాఫీపై ఆలోచిస్తా:
ఈ హామీపై ఆదిలోనే చేతులెత్తేశారు. ఎకరానికి రూ.పది వేల చొప్పున మాఫీ చేస్తామని ఇటీవల పేర్కొన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రైతు ఖాతాలోనూ ఒక్క పైసా కూడా జమ కాలేదు.

 

17. టమాట రైతుకు గిట్టుబాటుధర 10 కోట్లు:
ఇప్పటిదాకా అందుకు సంబంధించిన ఉత్తర్వులే వెలువడలేదు. కానీ.. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ టమాట రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రాజెక్టుపై సర్వే చేసేందుకు ఇటీవలే ఉపక్రమించింది.

 

18. తంబళ్లపల్లె నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.50 కోట్లు: ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు.    

 

19. తిరుపతిలో కలనరీ ఇన్‌స్టిట్యూట్: ఈ సంస్థను 2012లోనే అప్పటి కేంద్ర పర్యాటక సహాయ మంత్రి చిరంజీవి మంజూరు చేయిం చారు. కానీ.. ఈ సంస్థ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.

 

20. స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్:
ఇప్పటిదాకా అది కార్యరూపం దాల్చలేదు.

 -సాక్షి ప్రతినిధి, తిరుపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top