గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా ఆటోడ్రైవర్లు

Auto Driving Training For Women In Anantapur - Sakshi

ఆర్డీటీ ఆధ్వర్యంలో 100 మందికి శిక్షణ

అనంతపురం, నల్లమాడ: ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే కన్పించే మహిళా ఆటోడ్రైవర్లు ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపించనున్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఇప్పటికే 100 మంది మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకోగా, వారిలో నల్లమాడ ఏరియాకు సంబంధించినవారే 20 మంది ఉన్నారు. స్థానిక ఆర్డీటీ ఏరియా కార్యాలయంలో గురువారం ఏటీఎల్‌ రామాంజనేయులు ఆధ్వర్యంలో మహిళా ఆటోడ్రైవర్లను సమావేశపరచి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కదిరి రీజనల్‌ డైరెక్టర్‌ ప్రమీలాకుమారి, ఏటీఎల్‌ రామాంజనేయులు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో రాప్తాడులోని ఏఎఫ్‌ డ్రైవింగ్‌ స్కూల్‌లో ఇటీవల వందమంది మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

దాంతోపాటు వారికి కరాటే కూడా నేర్పించామన్నారు. నల్లమాడ ఏరియా పరిధి నుంచి 20 మంది మహిళలు శిక్షణలో పాల్గొనగా వారికి వసతి, భోజనం ఇతర ఖర్చుల కింద రూ.2లక్షలను మండలంలోని పెమనకుంటపల్లి తండావాసులు గ్రామ స్వరాజ్య నిధి నుంచి సమకూర్చారని చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు ఆటో కొనుగోలు కోసం డీఆర్‌డీఏ వెలుగు ద్వారా సబ్సీడీ రుణం మంజూరు చేసేందుకు అధికారులు ఇదివరకే అంగీకారం తెలిపారన్నారు. డ్రైవింగ్‌ పూర్తి చేసుకున్న మహిళలకు లైసెన్స్‌ ఇప్పించే బాధ్యత సంస్థ తీసుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశ్యంతో ప్రప్రథమంగా ఆర్డీటీ సంస్థ యువతులు, మహిళలకు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ఆటో నడుపుతూ చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల ఏటీఎల్‌ హనుమంతప్ప, సీఓ గోపాల్‌రెడ్డి, సీబీటీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top