విద్యార్థినులపై జ్వరాల పంజా

Ashram Girls Suffering With Fever In Vizianagaram - Sakshi

వణుకుతున్న కొత్తవలస

ఆశ్రమపాఠశాల విద్యార్థినులు   

ఆందోళనలో తల్లిదండ్రులు

విజయనగరం, సాలూరురూరల్‌: మండలంలోని కొత్తవలస గిరిజన  బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎ. పావని, యు.కృష్ణవేణి, ఎం.హేమలత, సీహెచ్‌.భవానీ, జె.పార్వతి, కె.స్వప్న, జి.మేఘన, పి.వసుంధర, తదితరులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై హెచ్‌ఎం సంధ్యారాణి మాట్లాడుతూ, ఎనిమిది మంది విద్యార్థినులు జ్వరంబారిన పడినట్లు వైద్యులు తెలిపారని చెప్పింది. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించినట్లు సమాచారం.

సేవకురాలిగా హెచ్‌ఎం..
పాఠశాల ఏఎన్‌ఎం ముంగి వెంకటలక్ష్మి విద్యార్థినులను తీసుకుని ఆస్పత్రులకు వెళ్తుండడంతో మిగిలిన విద్యార్థినులకు హెచ్‌ఎం సంధ్యారాణి దగ్గరుండి మరీ సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు టెంపరేచర్‌ తీయడం.. దగ్గరుండి మందులు వేయించడం.. తదితర పనులన్నీ హెచ్‌ఎం చేస్తోంది.

ఒకే మంచంపై ఇద్దరు
ఆశ్రమ పాఠశాలలోని సిక్‌ రూమ్‌లో ఒక్కో మంచంపై ఇద్దరేసి విద్యార్థినులు పడుకుంటున్నారు. ఒక్కో మంచంపై ముగ్గురేసి కూడా ఉండి వైద్యసేవలు పొందుతున్నారు.

తడవడం వల్లే..
భోజనాలకు వెళ్లే సమయంలో తడిసి పోవడం వల్లే జ్వరాలు ప్రబలాయని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెస్‌ వద్ద భోజనం చేసే సౌకర్యం లేకపోవడంతో భోజనం పట్టుకుని తిరిగి డార్మిటరీకి వచ్చే క్రమంలో తడిసిపోతున్నామని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థినులు జ్వరాల బారిన పడడం వల్ల సిబ్బందికి కూడా ఇక్కట్లు తప్పడం లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. రిపోర్టులు తీసుకురావడం వంటి పనులతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పంపించాలని కోరుతున్నారు. అయితే ఇళ్లకు వెళ్లినా అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే తమకే ఇబ్బందని, అందుకే ఇక్కడే వైద్యసేవలందిస్తామని సిబ్బంది చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top