అడుగడుగునా అప్రమత్తం 

Arrangements For CM Jagan Visit In Kadapa - Sakshi

సీఎం పర్యటనకు పోలీసుల నిఘా

ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు 

4000 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు 

జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

సాక్షి, ప్రతినిధి కడప/సాక్షి కడప : జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడురోజుల పర్యటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన భద్రతకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.  శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ బహిరంగసభలతోపాట సీఎం పాల్గొనే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. బహిరంగసభల వద్ద సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామన్నారు. జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి బహిరంగసభల వద్ద భారీగా పోలీసులను వినియోగిస్తున్నామన్నారు. బందోబస్తుకు 4000 మందిని వినియోగిస్తున్నామన్నారు.ఐదుగురు అడిషనల్‌ ఎస్పీలతోపాటు 30మంది డీఎస్పీలు విధుల్లో ఉంటారని తెలిపారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. తొలిరోజు సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు చేయనున్నారు.  

ఆ వివరాలిలా...
►కడప–రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మితమైన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని  ప్రారంభిస్తారు. రిమ్స్‌ ఆస్పత్రిలో డాక్టర్‌ వైఎస్సార్‌ కేన్సర్‌ హాస్పిటల్,  రీసెర్చ్‌ ఇన్సిట్యూట్‌ రూ.175 కోట్లతో ఏర్పాటు చేయనున్న డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌కు, రూ.25.85 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయానికి, ఎలీ్వప్రసాద్‌ ఐ ఇన్సిట్యూట్, దేవునికడప చెరువు అభివృద్ది పనులకు, రాజీవ్‌మార్గ్‌ రోడ్డు అభివృద్దికి,  గూడూరు వద్ద  ప్రీ మెట్రిక్‌ బాయ్స్‌ హాస్టల్,  పోస్ట్‌ మెట్రిక్‌ బాయ్స్‌ హాస్టళ్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

►కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత ఖర్చులతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 

►జమ్మలమడుగుకు వెళ్లి సున్నపురాళ్లపల్లె వద్ద నిర్మిస్తున్న స్టీల్‌ కర్మాగారానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు.  

►మధ్యాహ్నం మైదుకూరు నియోజకవర్గం  నేలటూరు వద్ద కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, రూ. 1357.10 కోట్లతో నిర్మించనున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, రూ. 312 .30 కోట్లతో నిర్మించనున్న జోలదరాశి రిజర్వాయర్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు.  రూ. 7.50  కోట్లతో మైదుకూరు నియోజకవర్గంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాలకు, రూ. 7.77 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లకు, రూ.30.20 కోట్లతో నిర్మించనున్న సిమెంటురోడ్లు, డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. దువ్వూరు మండలంలో గ్రామ సచివాలయ భవనాలకు,  నేలటూరులో సీసీ రోడ్లకు, ఢ్రైనేజీలకు, బుక్కాయిపల్లె–నేలటూరు రోడ్డు పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఆయన ఇడుపులపాయకు వెళతారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top