అదరహో..అరకు కాఫీ

Araku Coffee Will Be Get Market In North East States - Sakshi

ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణకు కసరత్తు

కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిన జీసీసీ

ఏపీ భవన్‌ వద్ద కార్పొరేట్‌ తరహాలో విక్రయ కేంద్రం

ఇప్పటికే కాఫీ షాప్‌తో ఆరకు కాఫీకి ఢిల్లీలో ఆదరణ

సాక్షి, విశాఖపట్నం: అరకువ్యాలీ సేంద్రీయ కాఫీ ఘుమఘుమలు ఇక ఉత్తర, ఈశాన్య భారతానికి వ్యాపించనున్నాయి. ఆ దిశగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పక్కా ప్రణాళికతో సిద్ధమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అమ్మకాల విస్తరణపైనే జీసీసీ ఎక్కువ దృష్టి సారించింది. కార్పొరేట్‌ తరహాలో బహుముఖ వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసింది. అవన్నీ ఓ కొలిక్కిరావడంతో ఇప్పుడు కాఫీ సాగులేని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌పై కన్నేసింది. ఈ ప్రాంతాలకు ప్రస్తుతం కర్ణాటక నుంచే కాఫీ ఎగుమతి అవుతోంది. అక్కడి కాఫీ సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతున్నారు. అందుకు భిన్నంగా అరకువ్యాలీ కాఫీ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే సాగు అవుతోంది. దీనికి బాగా ఆదరణ లభిస్తోంది. దాంతో అక్కడి వారికి సేంద్రీయ కాఫీ రుచి చూపించడానికి జీసీసీ సన్నద్ధమవుతోంది.
 
ఢిల్లీలో జీసీసీ విక్రయ కేంద్రం..
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ వద్ద జీసీసీ ఇప్పటికే కాఫీ షాప్‌ను ఏర్పాటు చేసి కాఫీని విక్రయిస్తోంది. ఇకపై వివిధ రకాల సేంద్రీయ అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పొరేట్‌ స్థాయిలో విక్రయశాలను ఏపీ భవన్‌ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనుంది. అలాగే జీసీసీ ఉత్పత్తులను మార్కెటింగ్‌కు వీలుగా న్యూఢిల్లీలోని పూసా వద్ద ఒక గోదాంను కేటాయించడానికి ట్రైబల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ట్రైఫెడ్‌) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇక విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో జీసీసీ ఉత్పత్తుల విక్రయశాలలు, కాఫీ షాప్‌ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ జీసీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి. బాబూరావునాయుడు గత నెలలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందని, త్వరలోనే జీసీసీ వ్యాపార విస్తరణ సాకారమవుతుందని బాబూరావునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.  

మన్యం పంటలతో ప్రస్థానం..
విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో విస్తరించిన మన్యం ఎన్నో ఆహార, ఔషధ పంటలకు పుట్టినిల్లు. పసుపు, శీకాకాయలు, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, రాజ్‌మా, బొబ్బర్లు, మిరప, జీడిమామిడి... ఇలా ఒకటి కాదు దాదాపు ఇరవైకి పైగా పంటలు విస్తారంగా పండుతాయి. కాఫీ సాగు ఏటా విస్తరిస్తోంది. అరకువ్యాలీ కాఫీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయింది. మన్యంలో ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నప్పటికీ 70 వేల ఎకరాల్లో ఏటా 8 వేల నుంచి పది వేల టన్నుల వరకూ కాఫీ గింజల దిగుబడి వస్తోంది. సముద్రమట్టానికి 1,500 నుంచి మూడు వేల మీటర్ల ఎత్తున ఉన్న మన్యంలో సారవంతమైన ఏటవాలు ప్రాంతమంతా కాఫీ సాగుకు అనుకూలంగా ఉంది.

సిల్వర్‌ ఓక్‌ చెట్ల మధ్య కాఫీతో పాటు మిరియాల సాగును అంతరపంటగా వేస్తున్నారు. ఇది లాభసాటిగా ఉండటంతో దాదాపు 93 వేల మంది రైతులు కాఫీ సాగు చేస్తున్నారు. వారి నుంచి కాఫీ గింజలను సేకరిస్తున్న జీసీసీ ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాల్లో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ చేయిస్తోంది. ఈ రెండు ప్రక్రియలనూ విశాఖలోనే చేసేలా ప్రాసెసింగ్, ప్యాకింగ్‌ యూనిట్‌ మంజూరు కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు జీసీసీ ఎండీ బాబూరావునాయుడు తెలిపారు.

సహకార వ్యాపారం..
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాలతో సహకార వ్యాపారానికి జీసీసీ తెరతీసింది. జార్ఖండ్‌లో కాఫీ సాగు లేదు. కానీ తేనె విరివిగా దొరుకుతోంది. ఆ రాష్ట్రంలో జీసీసీ కాఫీ వ్యాపారం చేస్తూ మరోవైపు తేనెను కొనుగోలు చేస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 40 శాతం అటవీ ప్రాంతమే. అక్కడ జీడిమామిడి సేంద్రీయ విధానంలో సాగవుతోంది. అక్కడ జీడిపప్పును జీసీసీ మార్కెటింగ్‌ చేయనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top