ప్రపంచస్థాయి పరిశ్రమలకు ఏపీ అనుకూలం

AP is suitable for world class industries - Sakshi

కేంద్రం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యంలో రాష్ట్ర వాటా పెంచుతాం 

పెట్రో, కెమికల్‌ తదితర రంగాలపై దృష్టి 

ముంబై సదస్సులో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి   

సాక్షి, అమరావతి : సహజ సిద్ధమైన నిక్షేపాలు, వనరులు, అవకాశాలు అపారంగా కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ముంబైలో సోమవారం జరిగిన గ్లోబల్‌ కెమికల్స్, పెట్రో కెమికల్స్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఆయన మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రానున్నాయన్నారు. ప్రపంచస్థాయి పరిశ్రమలకు ఏపీలో అన్ని విధాల అనుకూల వాతావరణం ఉందన్నారు.

భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి ఈ సదస్సు ఒక వేదికలా ఉపయోగపడుతుందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ పరుస్తామని మేకపాటి చెప్పారు. పెట్టుబడులకు గల అవకాశాలు, అనుకూల రంగాలను సదస్సులో మంత్రి వివరించారు. ఏపీ తీరంలో గ్యాస్, చమురు, పెట్రోలియం వంటి సహజ వనరులు భారీగా ఉన్నాయని.. అవే రాష్ట్రానికి అరుదైన సహజ సంపదగా అభివర్ణించారు. విశాఖ–కాకినాడ మధ్యలో ఏర్పాటుచేయనున్న పెట్రోలియం, కెమికల్‌ అండ్‌ పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌) కారిడార్‌ పెట్టుబడుల గురించి కూడా మంత్రి వివరించారు.

ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాష్ట్రంలో పర్యటించి ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ వంటి ప్రభుత్వరంగ సీఎండీలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించిన విషయాన్ని సదస్సులో మేకపాటి ప్రస్తావించారు. కాగా, కేంద్రం 2025 కల్లా 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్దేశించుకుందని.. ఇందులో కోస్టల్‌ కారిడార్, పెట్రో కెమికల్‌ కారిడార్లే గ్లోబల్‌ ఎకానమీలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్‌ వాటా పెంచాలన్నదే తమ ప్రధాన ధ్యేయమని మేకపాటి స్పష్టంచేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top