టీబీ నిర్మూలనలో రెండో స్థానంలో ఏపీ 

AP is second in the eradication of TB - Sakshi

దేశంలో 14 % పెరిగిన టీబీ కేసులు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీబీ నిర్మూలనలో  దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 2019లో 24.04 లక్షల టీబీ కేసులను గుర్తించామని, 2018తో పోల్చితే కేసుల సంఖ్య 14 శాతం పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో ప్రైవేటు రంగంలో గుర్తించిన కేసుల సంఖ్య 6.78 లక్షలుగా ఉందని తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్, సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే బుధవారం ఇక్కడ టీబీ వార్షిక నివేదిక–2020ని విడుదల చేశారు. నివేదిక ప్రకారం..

► 2017లో దాదాపు 10 లక్షల మేర తప్పిపోయిన టీబీ కేసుల సంఖ్య ఉండగా.. ఇప్పుడది 2.9 లక్షలకు తగ్గింది. 
► హెచ్‌ఐవీ పరీక్షలు చేసిన టీబీ పేషెంట్ల సంఖ్య 2018తో పోలిస్తే 14 శాతం పెరిగి 81 శాతానికి చేరింది. 
► 4.5 లక్షల డాట్‌ కేంద్రాల ద్వారా దాదాపు అన్ని గ్రామాల్లో టీబీ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. 
► టీబీ పేషెంట్లకు నిక్షయ్‌ పోషణ్‌ యోజన ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ కోసం వ్యవస్థ పూర్తిస్థాయిలో రూపొందిందని వెల్లడించింది. 
► ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని వివరించారు. 
► నేషనల్‌ టీబీ ఎలిమినేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌టీఈపీ)–2019లో అత్యుత్తమ పనితీరుకు కేంద్రం ర్యాంకులు ప్రకటించింది. 
► 50 లక్షలకు పైబడిన జనాభా గల పెద్ద రాష్ట్రాల కేటగిరీల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచి వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
► 50 లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన చిన్న రాష్ట్రాల కేటగిరీలో త్రిపుర, నాగాలాండ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.
► కాగా, టీబీ నిర్మూలనలో ఏపీ రెండో స్థానం లభించడంపై రాష్ట్ర క్షయ నిర్మూలనా ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ రామారావు సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్రంలో 99,904 మంది టీబీ రోగులను గుర్తించి చికిత్స అందించామని, ఇందులో 92 శాతం రికవరీ రేటు నమోదైనట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top