రూ.18 వేలతో ఐఏఎస్‌ కుమారుడి పెళ్లి! | AP IAS Officer Plans Son Wedding For Just Rs 18,000 | Sakshi
Sakshi News home page

రూ.18 వేలతో ఐఏఎస్‌ కుమారుడి పెళ్లి!

Feb 9 2019 4:28 PM | Updated on Feb 9 2019 5:44 PM

AP IAS Officer Plans Son Wedding For Just Rs 18,000 - Sakshi

వధూవరులు, వారి కుటుంబ సభ్యులతో గవర్నర్‌ దంపతులు

పెద్ద ఉద్యోగంలో ఉండికూడా తన కుమారుడికి పెళ్లికి కేవలం 18 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు.

విశాఖపట్నం: మామూలుగా పెళ్లికి ఎంత ఖర్చవుతుంది అంటే.. సమాధానం లక్షలు రూపాయలు అని సమాధానం వస్తుంది. ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులైతే తమ హోదాకు తగ్గకుండా లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పట్నాల బసంత్‌ కుమార్‌ అందరిలా కాదు. పెద్ద ఉద్యోగంలో ఉండికూడా తన కుమారుడికి పెళ్లికి కేవలం 18 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా?

నగరంలోని విశాలాక్షినగర్‌ దయాల్‌నగర్‌కాలనీలో నివాసం​ ఉంటున్న బసంత్‌ కుమార్‌.. విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అభినవ్‌ మానస్‌ వివాహం ఈ నెల 10న డాక్టర్‌ లావణ్యతో జరగనుంది. ఈ వివాహానికి వరుడి తండ్రి రూ. 18 వేలు మాత్రమే ఖర్చు చేస్తుండడం విశేషం. రాధాసోమి సత్సంగ్‌ నియమాలు పాటించే ఆయన 2017లో కుమార్తె బినతి పెళ్లికి కేవలం రూ.16,100 మాత్రమే ఖర్చుపెట్టారు.

కుమారుడి వివాహానికి కూడా ఇదేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పెళ్లి శుభలేఖకు ఐదు రూపాయలు వెచ్చించారు. వందలోపే అతిథులను ఆహ్వానించారు. పుష్పగుచ్చాలు, కానుకలు అంగీకరించబోమని శుభలేఖలో స్పష్టం చేశారు. పురోహితుడికి రూ. 1000, వంటమనిషికి రూ. 500 ఇవ్వనున్నారు. తమ కాలనీలో పండించే తోట నుంచి వంటకు కావాల్సిన కూరగాయాలు తెచ్చుకోనున్నారు. మొత్తానికి పెళ్లి భోజనం కోసం ఒక్కొక్కరికి కేవలం రూ. 13 వెచ్చిస్తున్నారు. కళ్యాణ వేదిక వుడా చిల్డ్రన్‌ ఎరీనాకు రూ.వెయ్యి చెల్లించారు. పెళ్లికి వచ్చే అతిథులు సత్సంగ్‌ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. నేల మీదే కూర్చొవాల్సి ఉంటుంది. కుమారుడి పెళ్లికి బసంత్‌ కుమార్‌ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకపోవడం విశేషం.

గవర్నర్‌ దంపతుల ఆశీస్సులు
వివాహం పవిత్రమైన బంధమని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ బసంత్‌కుమార్‌ కుమారుడు అభినవ్‌మానస్‌ వివాహం సందర్భంగా నగరంలోని విశాలాక్షినగర్‌ దయాల్‌నగర్‌కాలనీలో శుక్రవారం రాత్రి ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సతీమణితో కలసి హాజరైన గవర్నర్‌ కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్‌ దంపతులు ముందుగా ఇక్కడి పార్కులో మొక్కలు నాటారు. రాధాస్వామి మందిరంలో నిర్వహించిన సత్సంగంలో కొంతసేపు పాల్గొన్నారు. అనంతరం బ్యాటరీ వాహనంలో కాలనీ అంతా సందర్శించారు. కాలనీ పద్ధతులు, విశేషాలు, ఇక్కడ కట్టుబాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కాబోయే దంపతులు సమాజంలో మంచి జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌ పీకే రత్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement