స్వీయ గృహ నిర్బంధమే మేలు

AP Govt has taken more measures to prevent Covid-19 - Sakshi

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఇళ్లకు సర్కారు నోటీసులు

బాధ్యత గల పౌరులుగా ఇది చేయక తప్పదు 

14 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకూడదు 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. విదేశీ ప్రయాణికులు ఇకపై 14 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి ఇంటికెళ్లి ఈ మేరకు గృహ నిర్బంధ నోటీసులు అతికించాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది.

ఈ నోటీస్‌ ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌ పోర్ట్‌లోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలున్నాయని తేలితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు పంపిస్తారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా అనుమానిత లక్షణాలున్న 105 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా..93 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటివరకూ ఒక్కటి మాత్రమే పాజిటివ్‌ కేసు నమోదైంది. బాధితుడు కూడా కోలుకున్నాడు. మరో 11 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.

లక్షణాలు లేకున్నా ఇంట్లో ఉండాల్సిందే 
- విదేశాల నుంచి వచ్చిన వారిలో వైరస్‌ లక్షణాలు లేకపోయినా 14 రోజుల పాటు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలి. 
- ఈ నోటీసులను కాదని బయటకు వస్తే అంటువ్యాధుల చట్టం ప్రకారం (ఎపిడెమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌ 1897లోని సెక్షన్‌ 2, 3, 4) చర్యలు తీసుకుంటారు.  
- ఇలాంటి వారుండే ప్రతి ఇంటికీ ఒక ఏఎన్‌ఎం, ఒక ఆశా కార్యకర్తను పహారాగా నియమించారు.  
- వాళ్లు బయటకు వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారమిస్తారు. 
- హోమ్‌ ఐసోలేషన్‌ ఉండే వారితో సమీప పీహెచ్‌సీ వైద్యుడు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మాట్లాడాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top