ఎమ్మార్వో వనజాక్షికి బదిలీల శిక్ష

ap govt harassing mro vanajakshi - Sakshi - Sakshi - Sakshi

తహశీల్దారు వనజాక్షిపై అధికార పార్టీ నేతల వేధింపులు

భూ దోపిడీకి అడ్డుపడుతుండటమే కారణం

కులం పేరుతో దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు 

కక్ష సాధింపునకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం సంపాదించిన వైనం 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: అవినీతి, అక్రమాలను ఎంతమాత్రం సహించను.. ఒక్క ఫోన్‌ చేస్తే చాలు అవినీతిపరుల నుంచి తిన్నదంతా కక్కిస్తా.. అని ముఖ్యమంత్రి ఒకవైపు గర్జిస్తుంటారు. మరోవైపు అధికార పార్టీ నేతలు అవినీతిని అడ్డుకునే అధికారులపై చిందులు తొక్కుతుంటారు. చెప్పినట్లు వినకపోతే దాడులకు దిగుతారు. తమ కార్యకలాపాలకు సహకరించకపోతే బదిలీ చేయిస్తారు. కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతారు. తహశీల్దారు వనజాక్షి ఉదంతమే ఇందుకు తార్కాణం. 

జులై 8, 2015
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు కృష్ణా జిల్లా ముసునూరు తహశీల్దారు ద్రోణవల్లి వనజాక్షిపై దాడికి పాల్పడ్డారు. తమ్మిలేరు నుంచి అక్రమంగా ఇసుక తీసుకెళ్లవద్దంటూ ట్రాక్టర్లను అడ్డుకున్నందుకు తహశీల్దారు, ఆమె సిబ్బందికి పోలీసుల సాక్షిగా చింతమనేని, ఆయన వర్గీయులు పట్టపగలే చుక్కలు చూపించారు. ఈ వ్యవహారంలో తహశీల్దారు వనజాక్షిదే తప్పు అని ముఖ్యమంత్రి తేల్చేశారు. 

జూన్‌ 25, 2016
వనజాక్షిని ముసునూరు నుంచి నూజివీడు తహశీల్దారుగా బదిలీ చేశారు. భూ వివాదంలో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని టీడీపీ నేతలు ఆమెపై ఒత్తిడి పెంచారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు వనజాక్షి లొంగకుండా నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో అధికార పార్టీ నాయకులు మరో ఎత్తు వేశారు. మీర్జాపురం గ్రామానికి చెందిన వక్కలగడ్డ విజయభాస్కర్‌ కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ తహసీల్దారును సంప్రదించారు. ఆయన బీసీ–సి (క్రిస్టియన్‌)గా నిర్ధారించి నూజివీడు ఆర్డీవోకు నివేదించగా ఆ మేరకు సర్టిఫికెట్‌ జారీ అయ్యింది. వనజాక్షి తనను కులం పేరుతో దూషించారని విజయభాస్కర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

జూన్‌ 25, 2017
తహశీల్దారు, ఫిర్యాదుదారు కులాలను ధ్రువీకరించాలని నూజివీడు పోలీసు సబ్‌ డివిజనల్‌ ఆఫీసరు ఆర్డీవో కార్యాలయాన్ని కోరారు. ఫిర్యాదుదారు బీసీ–సి, తహశీల్దారు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారని అప్పటి నూజివీడు ఆర్డీవో సిహెచ్‌ రంగయ్య వివరాలు పంపారు. 

నవంబరు 1, 2017
ఫిర్యాదుదారు విజయభాస్కర్‌ హిందు–మాదిగ(ఎస్సీ)గా కుల ధ్రువీకరణ పత్రం ఆర్డీవో కార్యాలయం నుంచి అందిందని, తొలుత బీసీ–సి అని ఇచ్చారని, దేన్ని పరిగణనలోకి తీసుకోవాలో తేల్చిచెప్పాలని నూజివీడు డీఎస్పీ ఆర్డీవో కార్యాలయాన్ని వివరణ కోరుతూ ఈ నెల 15న లేఖ రాశారు. కాగా, ఈ రెండు సర్టిఫికెట్లను ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య జారీ చేయడం గమనార్హం. ఎస్సీ సర్టిఫికెట్‌ ఫిర్యాదుదారుడికి అనుకూలంగా ఉండటంతోపాటు తహశీల్దారు వనజాక్షిపై కక్ష సాధింపునకు ఉపయోగపడుతుందనేది పాలకపక్ష నేతల వ్యూహమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బదిలీల బంతాట 
ఎమ్మెల్యే చింతమనేని దాడి తరువాత వనజాక్షిని గత ఏడాది జూన్‌ 25న ముసునూరు నుంచి నూజివీడుకు బదిలీ చేశారు. అక్కడి టీడీపీ నేతలు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా భూ కుంభకోణాలకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అక్టోబరు 27న విస్సన్నపేటకు బదిలీ చేశారు. తమ మండలానికి ఆమె వద్దంటూ విస్సన్నపేటలోని భూమాఫియా.. మంత్రులను కోరడంతో బదిలీ ఉత్తర్వులను నిలిపేశారు. నూజివీడు నుంచి తక్షణమే రిలీవ్‌ కావాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. చివరకు ఆమెను నూజివీడు ఆర్డీవో కార్యాలయం ఏవోగా నియమించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top