216 మార్కెట్‌ కమిటీలకు నోటిఫికేషన్‌

AP Government Released Market Committee Notification - Sakshi

108 కమిటీలకు మహిళా చైర్‌పర్సన్లు 

108 కమిటీలు ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకు.. 

నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల మార్కెట్‌ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్‌ కమిటీ ఉండాలనే సూచనల మేరకు.. మార్కెట్‌ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో  మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. వీటిన్నింటికీ ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్, సహకారశాఖ  ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో గుంటూరులోని మార్కెటింగ్‌శాఖ స్పెషల్‌ కమిషనర్‌కు తెలియ చేయాలని కోరారు.

216 కమిటీల్లో 50 శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చే విధంగా రిజర్వేషన్లు పాటించాలని సూచించారు. ఈ మేరకు మొత్తం 216 కమిటీల్లో 108 కమిటీలకు మహిళలు చైర్‌పర్సన్లుగా నియమితులు కానున్నారు. 50 శాతం నామినేటెడ్‌ పోస్టులను మహిళలకు రిజర్వు చేస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఈ ఉత్తర్వుల ద్వారా ఆచరణలోకి రానుంది. ఒక్కో మార్కెట్‌ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యకుడిగానూ, నలుగురు అధికారులు, ముగ్గురు వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగానూ ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని మార్కెటింగ్, మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top