‘మద్దతు’కు భరోసా

AP Government Helps To Farmers With Price Stabilization Fund - Sakshi

 రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

పక్షం రోజులకోసారి ధరల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం 

హర్షం వ్యక్తం చేస్తున్నఅన్నదాతలు 

ప్రకృతి వైపరీత్యాలు..చీడపీడల నుంచి పైర్లను కాపాడుకొని..రేయింబవళ్లు కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే రైతుకు మద్దతు ధర లభించించేది కాదు. ఆరుగాలం శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేది కాదు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కర్షకులు తీవ్ర వేదనకు గురయ్యేవారు. తమను ఆదుకునే వారు రాకపోతారా అని ఎదురు చూసేవారు.. ఇదంతా గతం. నేడు పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. మద్దతు ధర కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. పక్షం రోజులకోసారి మార్కెట్‌లో ధరల వివరాలు సైతం సేకరిస్తోంది. అన్నదాతకు ‘మద్దతు’పై భరోసా ఇచ్చేందుకు అక్టోబరు 15 నాటికి కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తోంది.   

సాక్షి, కర్నూలు : జిల్లాలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు భారీగా కురిసి..ఖరీఫ్‌ పంటలు కళకళలాడుతున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 6.27 లక్షల హెక్టార్లు ఉండగా..5.83 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది పత్తి  2,65,639 హెక్టార్లలో సాగైంది. కాల్వలకు నీళ్లు రావడం, చెరువులు నిండడంతో జిల్లాలో వరి సాగు ఆశాజనకంగా ఉంది. సాధారణ వరి సాగు 73,120 హెక్టార్లు ఉండగా... ఇప్పటి వరకు 57,549 హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడులు కూడా సాధారణం కంటే పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 91,190 హెక్టార్లు ఉండగా 79,407 హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పెసర, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, వాము, ఉల్లి, మిరప ఇలా అన్ని రకాల పంటలు జిల్లాలో సాగవుతున్నాయి. 

రైతుకు ‘స్థిరీకరణ’ ఊరట 
రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో రైతులకు ఊరట లభించింది. గతంలో మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పుడు  ప్రభుత్వాలు స్పందించేవి కాదు. దీంతో ఇబ్బందులు పడేవారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గత ప్రభుత్వం మొక్కుబడిగా మొక్కజొన్న రైతులకు క్వింటాల్‌కు రూ.200 మద్దతును ప్రకటించి ఆచరణలో నీరుకార్చింది. ప్రస్తుత ప్రభుత్వం..పకడ్బందీగా ‘మద్దతు’ను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు మద్దతు ధర లేక అల్లాడుతున్న శనగ రైతులకు గరిష్టంగా రూ.45వేలు ప్రకారం బ్యాంకు ఖాతాలకు జమ చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పదివేల మందికిపైగా రైతులకు దాదాపు రూ.35 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. ఎకరాకు 6 క్వింటాళ్ల ప్రకారం ఒక రైతుకు 5 ఎకరాల వరకు గరిష్టంగా 30 క్వింటాళ్లకు రూ.1500 ప్రకారం రూ.45వేలు రైతులకు ధరల స్ధిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం జమ చేసింది. 

ప్రతి 15 రోజులకు ధరల వివరాల సేకరణ.. 
జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయ ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. గతేడాది అనావృష్టి పరిస్థితులతో దిగుబడులు 75 శాతం పడిపోయాయి. ఏ పంటకూ గిట్టబాటు ధర లభించ లేదు. ఈ సారి వర్షాలు విస్తారంగా పడుతుండటంతో పంటల సాగు పెరిగింది. దిగుబడులు పెరిగే అవకాశం ఏర్పడింది. జూన్‌లో వేసిన పంటలు మరికొద్ది రోజుల్లో కోతకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి రైతుకూ మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో అక్టోబరు 15 నాటికి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా రైతులు నష్టపోకుండా ఉండేందుకు మార్కెట్‌లో వివిధ పంటలకు లభిస్తున్న ధరల వివరాలను ప్రతి 15 రోజులకు ఒక్కసారి ప్రభుత్వం సేకరిస్తోంది.   

ధరల వివరాలు పంపుతున్నాం
ఎప్పటికప్పుడు అన్ని పంటలకు లభిస్తున్న ధరల వివరాలను ప్రభుత్వానికి పంపుతున్నాం. అక్టోబరు 15నాటికి రైతులకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  – సత్యనారాయణచౌదరి,  ఏడీఎం, కర్నూలు 

శుభ పరిణామం  
రైతుల అభ్యన్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.. రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం శుభ పరిణామం. రైతులకు ఇది ఆనందాన్ని ఇస్తోంది.  మాకు 12 ఎకరాల భూమి ఉంది. ఇందులో పత్తి, మొక్కజొన్న, కంది పంటలు సాగుచేస్తున్నాం. ఈ సారి మద్దతు ధరలు లభిస్తాయనే భరోసా ఏర్పడుతోంది.  
–సోమన్న యాదవ్, తడకనపల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top