పాఠశాలల్లో పండుగ వాతావరణం

AP CM YS Jagan On Nadu Nedu Education Review Meeting - Sakshi

ఆహ్లాదకరంగా రంగులు.. అవగాహన కలిగించే బొమ్మలు ఉండాలి

మనబడి నాడు–నేడు సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

దాతలు చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయన్న అధికారులు

ఆ పనుల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశం

మిగిలిన దశల పనుల కోసం రుణాలపై దృష్టి పెట్టాలని నిర్దేశం

సచివాలయాల ఇంజనీర్లు రోజూ నాడు–నేడు పనులు చూడాలి

సాక్షి, అమరావతి : స్కూళ్లలో ఒక పండుగ వాతావరణం కనిపించాలని, స్కూలు భవనాల రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం.. స్కూల్‌ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్‌ వేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగులకు సంబంధించి సీఎం  జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు పలు రంగుల నమూనాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో చూపారు. సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.
 
► స్కూల్‌ బిల్డింగ్‌లకు వేసే కలర్స్‌ ఆహ్లాదకరంగా ఉండాలి. అక్కడ ఒక పండగ వాతావరణం కనిపించాలి. పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయించాలి. 

►  వర్షాకాల సీజన్‌ ముగిసిన తర్వాత ఆ పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలి. లేకపోతే ప్రజాధనం వృథా అవుతుంది.
సచివాలయాల ఇంజనీర్లకూ బాధ్యతలు 

► గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మనబడి నాడు–నేడు పనులను కూడా చూడాలి. వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలి. వారానికి ఒకసారి వారు ఆ పనులపై నివేదిక ఇవ్వాలి.

► స్కూళ్లలో పనులకు సంబంధించి ఎంబీ (మెజర్‌మెంట్‌ బుక్‌)లో రికార్డింగ్‌ పవర్స్‌ కూడా సచివాలయ ఇంజనీర్లకే ఇవ్వాలి. ఆ మేరకు ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌) రూపొందించాలి.

► రెండవ, మూడవ దశ పనులు కూడా సకాలంలో చేపట్టాలి. ఇందుకు అవసరమైన రుణాల సేకరణ ప్రక్రియ చేపట్టాలి. ఇప్పుడు స్కూళ్లలో పనులను పేరెంట్‌ కమిటీలు చేస్తున్నాయి కాబట్టి వాటిలో ఎలాంటి జాప్యం ఉండబోదు. 

ఆ పనుల బాధ్యత కలెక్టర్లకు అప్పగించండి
► మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ఇప్పుడు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు రూ.2 కోట్ల విలువైన పనులు చేస్తున్నారని చెప్పారు. అయితే పలు చోట్ల దాతలకు అప్పగించిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై సీఎం స్పందిస్తూ..వెంటనే ఆ పనుల బాధ్యత జిల్లాల కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, శాఖ కమిషనర్‌ చినవీరభద్రుడుతో పాటు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదంపై హై పవర్‌ కమిటీ నివేదిక)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top