‘రివర్స్‌’ సక్సెస్‌ 

Anilkumar Yadav Comments about Reverse tendering process success - Sakshi

ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు ఆదా: మంత్రి అనిల్‌ 

సాగునీటి శాఖలో మరో రూ.500 కోట్ల ఆదాకు అవకాశం

సాక్షి, అమరావతి: అవినీతికి తావు లేకుండా, ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానం పూర్తిగా విజయవంతమైందని, సాగునీటి ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు సుమారు రూ.1,000 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఈ స్ఫూర్తితో మున్సిపల్, గృహ నిర్మాణ శాఖల్లో సైతం రివర్స్‌ టెండరింగ్‌కు వెళతామని చెప్పారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తన శాఖలో రివర్స్‌ టెండరింగ్‌ వల్ల మరో రూ.500 కోట్లు ఆదా అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.62 కోట్లు ఆదా అయ్యాయన్నారు. బొగ్గు రవాణాలో కూడా రూ 25 కోట్లు ఆదా అయిందన్నారు.  

బాబు ముంచితే మేం ఆదా చేస్తున్నాం.. 
రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లకుండా టీడీపీ సర్కారు హయాంలో కేటాయించిన వారికే పనులు అప్పగిస్తే దాదాపు రూ.1,500 కోట్ల మేర ప్రజా ధనానికి గండిపడి ఐదుగురు లేదా పదిమంది జేబుల్లోకి వెళ్లేవని మంత్రి అనిల్‌ పేర్కొన్నారు. రివర్స్‌ టెండర్ల ద్వారా ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఆదా చేయగా మరో రూ.500 కోట్ల దాకా ఆదా జరిగే అవకాశం ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ డబ్బులతో సంక్షేమ పథకాల అమలు చేపట్టవచ్చన్నారు. టీడీపీ 2014లో అధికారంలో చేపట్టాక రెండేళ్ల పాటు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు. తాము కొద్ది నెలల్లోనే అన్నింటినీ సమీక్షించి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు రూ 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని ముంచితే తాము రూ.వేల కోట్లు ఆదా చేస్తున్నామని చెప్పారు. 

యుద్ధ ప్రాతిపదికన హంద్రీ–నీవా 
రాయలసీమను సస్యశామలం చేసేందుకు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సాగు, తాగునీటి కష్టాలను తీరుస్తామని అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో పథకంపై సమీక్ష సందర్భంగా మంత్రి అనిల్‌కుమార్‌ ప్రకటించారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు బీటీపీ, ఎగువ పెన్నార్‌ ఎత్తిపోతలకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top