ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు | Andhrula beauty actor Shobhan | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు

Jan 15 2015 2:17 AM | Updated on Jun 2 2018 2:59 PM

ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు - Sakshi

ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు

ఆంధ్రుల అందాల నటుడు ఎప్పటికీ శోభన్‌బాబేనని మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రుల అందాల నటుడు ఎప్పటికీ శోభన్‌బాబేనని మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శోభన్‌బాబు 79వ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి తదితరులు కేక్‌ను కట్ చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఆమని గ్రూపు గాయకులు, ప్రముఖ కళాకారిణి సుధారాణి ఆలపించిన సినీ గేయాలు ఆహూతులను అలరించాయి. కోట్ల మాట్లాడుతూ సినీ ప్రపంచంలో మచ్చలేని హీరో శోభన్‌బాబు ఒక్కరేనన్నారు. ఆయన పేరిట స్థాపించిన సేవా సమితి ద్వారా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు చేస్తున్న సేవ కార్యక్రమాలను అభినందించారు.

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శోభన్‌బాబు మృతి చెంది ఆరేళ్లు గడిచినా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వేడుకలకు 50 ఏళ్లు దాటిన వారే అధికంగా హాజరయ్యారంటే ఆయనపైనున్న మమకారం ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ శోభన్‌బాబు చూపిన దారిలోనే తాము పయనిస్తున్నట్లు చెప్పారు.

విలక్షణమైన నటనలో ఆయన శాశ్వతంగా ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం కర్నూలుకు చెందిన ప్రముఖ రచయితలు చంద్రశేఖర కల్కూర, జేఎస్‌ఆర్‌కే శర్మ, వైద్యం వెంకటేశ్వర ఆచారి, సుబ్బలక్ష్మిలను.. నాలుగు దశాబ్దాలుగా నాటక రంగంలో సేవ చేస్తున్న బీసీ కృష్ణ, రిటైర్డ్ మార్కెట్ కమిటీ సెక్రటరీ చంద్రన్న, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ప్రముఖ హార్మోనిస్ట్, రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీనివాసులును శోభన్‌బాబు సేవా సమితి తరపున సన్మానించారు. సుబ్బలక్ష్మి తరపున ఆమె భర్త వెంకటరమణను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్దార్‌బుచ్చిబాబు, సలాం, తిప్పన్న, శోభన్‌బాబు అభిమాన సంఘం నాయకులు జోగారావు, శివకుమార్, ఆర్‌వి.రమణ, జి.నాగరాజు, ప్రముఖ రచయిత యలపర్తి రమణయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement