మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి

Published Mon, May 8 2017 2:09 AM

మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి - Sakshi

పలువురి నివాళులు.. నేడు స్వగ్రామం పెనకపాడులో అంత్యక్రియలు  

అనంతపురం: అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి (70) ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... హైదరాబాద్‌లోని సోదరుడి నివాసంలో ఉంటూ అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. నారాయణరెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం మధ్యాహ్నం అనంతపురానికి తీసుకువచ్చారు. పీసీసీ చీఫ్‌ ఎన్‌. రఘువీరారెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డితో పాటు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన స్వగ్రామమైన రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం పెనకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణ రెడ్డి అనంతపురం మాజీ ఎమ్మెల్యే (వైఎస్సార్‌సీపీ) గురునాథ్‌ రెడ్డి సోదరుడు.

నేడు అనంతకు వైఎస్సార్‌సీపీ అధినేత
సాక్షి, హైదరాబాద్‌ : అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపం తెలిపారు. నారాయణరెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన సోదరుడు బి.గురునాథ్‌రెడ్డితో జగన్‌ ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. నారాయణరెడ్డి మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు జగన్‌ సోమవారం అనంతపురం వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement