కలెక్టర్లకూ ఓ ఖజానా

All works by tendering says Ap Govt - Sakshi

ఒక్కో కలెక్టర్‌కు  ఏడాదికి రూ.15 కోట్లు 

ఇప్పటికే నిధులు కేటాయించిన ప్రభుత్వం 

హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాలని సూచన 

పారదర్శకంగా పనులు చేపట్టాలని స్పష్టం

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా కలెక్టర్లకు అధికారం, దర్పం, హోదా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సొంతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేసేందుకు చిల్లిగవ్వ కూడా వారి ఖజానాలో లేని దుస్థితి. ఆసుపత్రి అభివృద్ధి నిధులనో, ఖనిజాభివృద్ధి నిధులనో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఓ ఖజానాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కలెక్టర్‌కు ఏడాదికి ప్రత్యేకంగా రూ.15 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టర్లకు రూ.195 కోట్లు కేటాయించింది.

ఈ నిధుల వినియోగంలో రాజకీయ జోక్యానికి తావులేకుండా.. కలెక్టర్ల విచక్షణకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. విద్యార్థులకు తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించడం, పారిశుధ్య నిర్వహణ, చిన్నచిన్న మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయొచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేసింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఇప్పటికే రూ.6.5 కోట్ల మేర నిధుల వినియోగానికి టెండర్లు పిలిచారు. 

టెండర్ల ద్వారానే అన్ని పనులు 
వాస్తవానికి గతంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను(ఎస్‌డీఎఫ్‌) కేటాయించింది. ఒక్కో జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్లు ఇచ్చింది. ఈ నిధులను ఖర్చు చేసే అధికారాన్ని కలెక్టర్లకే అప్పగించింది. కానీ, నిధుల వినియోగంలో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం రెయిన్‌గన్ల కొనుగోలు, సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసింది. ఇందులో కొన్ని పనులను అప్పటి అధికార పార్టీ నేతలకు నామినేషన్‌పై అప్పగించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ పని అయినా టెండర్‌ ద్వారానే అప్పగించాలని స్పష్టం చేసింది.

అనంతపురం జిల్లాలో రూ.6.5 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఎక్కడా నామినేషన్‌ పద్ధతిని పాటించడం లేదు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేకంగా కేటాయించిన బడ్జెట్‌ను సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తాం. తద్వారా రానున్న రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే రెండేళ్లలో పరిస్థితిలో మరింత సానుకూల మార్పు రావడం ఖాయం’’ అని అనంతపురం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top