కోస్తా ప్రాంతానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితమే తీరం దాటిన హెలెన్ తుపాన్‌తో ఉత్తర కోస్తా కకావికలమైంది.
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : కోస్తా ప్రాంతానికి మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. రెండు రోజుల క్రితమే తీరం దాటిన హెలెన్ తుపాన్‌తో ఉత్తర కోస్తా కకావికలమైంది. తాజాగా ‘లెహర్’ ముప్పు కోస్తాంధ్ర మీదకు దూసుకొస్తోండటంతో జిల్లా అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడి తుపానుగా మారుతోంది.
దీనికి లెహర్ అనే పేరు పెట్టారు. సూపర్‌సైక్లోన్‌గా మారే ఈ తుపాను వల్ల భారీ నష్టం సంభవించే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్‌దీవులకు సుమారు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న అల్పపీడనం తుపానుగా మారి మచిలీపట్టణం, కళింగపట్నం నడుమ కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటోంది. తీరం దాటే సమయంలో 100 నుంచి 150 కిలో మీటర్లు వేగంతో గాలులు వీచడంతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆ శాఖ యంత్రాంగం హెచ్చరిస్తోంది. అయితే లెహర్ తీరం దరి చేరే సమయానికి దిశ మారితే జిల్లాకు ముప్పు వచ్చే పరిస్థితి ఉండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
అప్రమత్తంగా ఉన్నాం :లక్ష్మీకాంతం, జేసీ
అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న సంకేతాలు అందాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సమాచారం అందించాం. ప్రాణనష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆస్తినష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాం.