విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం | 90 feet Mahesh babu Cutout in Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం

Sep 14 2014 2:22 PM | Updated on Jul 14 2019 1:42 PM

విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం - Sakshi

విజయవాడలో మహేష్ బాబు కటౌట్ కలకలం

నగరంలోని లెనిన్ సెంటర్లో భారీఎత్తున నిర్మించిన మహేష్ బాబు 'ఆగడు' చిత్రం కటౌట్ కలకలం సృష్టించింది.

విజయవాడ: నగరంలోని లెనిన్ సెంటర్లో భారీఎత్తున నిర్మించిన మహేష్ బాబు 'ఆగడు' చిత్రం కటౌట్ కలకలం సృష్టించింది.  ఆగడు సినిమా ఈ నెల 19న విడుదల కానున్న సందర్భంగా మహేష్ బాబు అభిమానులు 90 అడుగుల కటౌట్ నిర్మించారు.  అభిమానులు చందాలు వేసుకొని మూడు రోజుల నుంచి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో  అభ్యంతరం చెప్పని పోలీసు అధికారులు కటౌట్ పూర్తి అయిన తరువాత అనుమతిలేదని, అడ్డుగా ఉందని అభ్యంతరం తెలిపి, దానిని తొలగించారు. దాంతో మహేష్ బాబు అభిమానులు తీవ్ర మనఃస్తాపానికి గురయ్యారు. తీవ్ర నిరసన తెలిపారు. మనఃస్తాపంతో ఓ అభిమాని కాలువలో దూకాడు. తోటి అభిమానులు అతనిని బయటకు తీసుకువచ్చారు.

 మహేష్ బాబు సినిమా విడుదలైన ప్రతిసారి తాము  కటౌట్లు కడుతున్నామని అభిమానులు చెప్పారు. సినిమా విడుదలైన తరువాత వారం, పది రోజులకు  దానిని తామే తొలగించివేస్తున్నామని వారు తెలిపారు. ఎవరికీ, ఎప్పుడూ ఇబ్బంది కలిగించడంలేదని చెప్పారు. ఎప్పుడూ అభ్యంతరం చెప్పని పోలీస్ అధికారులు ఇప్పుడు అభ్యంతరం చెప్పడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన కటౌట్ను తిరిగి నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఆ తరువాత తామే దానిని తొలగిస్తామని వారు చెప్పారు. ఓ వృద్ధురాలు కూడా మహేష్ బాబు కటౌట్ తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కటౌట్ బాగుందని కుళ్లుతో, ఈర్ష్యతో తొలగించారని ఆమె విమర్శించింది. తాను కృష్ణ అభిమానినని, ఆ తరువాత మహేష్ బాబు అభిమానినని ఆమె  చెప్పింది.

మహేష్ బాబు అభిమానులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభిమానులు మహేష్ బాబు జిందాబాద్ అని నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. తాము ఎంతో అభిమానంతో రూపొందించుకున్న కటౌట్ను నగరంలో ఎక్కడో ఒకచోట నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement