27,43,754 జిల్లాలో ఓటర్లు | 27,43,754 district voters | Sakshi
Sakshi News home page

27,43,754 జిల్లాలో ఓటర్లు

Jan 25 2014 4:08 AM | Updated on Aug 14 2018 4:32 PM

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా జిల్లాలో పక్కా ఓటరు జాబితా ప్రచురణకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు     సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్     కసరత్తు వేగవంతం చేస్తోంది. సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటివరకు నమోదైన ఓటర్ల తుది జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి నివేదించింది. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 27,43,754 ఓటర్లుగా నమోదయ్యారు. 2013 నవంబర్ 18 నాటి ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి 26,40,264 మంది ఓటర్లు ఉండగా అనంతరం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో కొత్తగా 1,03,530 మంది జాబితాలో చేరారు. ఓటరు నమోదు నిరంతరం కొనసాగుతున్నా ఫిబ్రవరి 15 వరకు నమోదయ్యే ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.
 
 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా జిల్లాలో పక్కా ఓటరు జాబితా ప్రచురణకు అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. గతేడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ గడువు విధించింది. ఈ సమయంలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ జిల్లాకు వచ్చి ఓటరు నమోదును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు అనర్హులను పక్కాగా జాబితా నుంచి తొలగించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో నమోదు గడువు మూడుసార్లు పెంచు తూ వచ్చిన నేపథ్యంలో తుదిజాబితా ప్రచురణకు సమయం సరిపోకపోవడంతో ఈ నెల 16 నుంచి 31వరకు ఎన్నికల కమిషన్ గడువు పెంచింది.
 
 గతేడాది నవంబర్ 18 నాటి ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 38,80,041 మంది జనాభా ఉన్నారు. అందులో మహిళలు 19,47,556 మంది కాగా, పురుషులు 19,32,485 మంది. పురుష ఓటర్లు 13,29,067, మహిళా ఓటర్లు 13,11,157 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను చైతన్యవంతం చేయడంలో సఫలీ కృతమైంది. అనేక అవగాహన కార్యక్రమాల ఫలి తంగా కొత్త ఓటరు నమోదు కోసం యువత నుంచి మంచి స్పందన వచ్చింది.
 
 జిల్లాలో 1.45 లక్షల మంది ఓటుహక్కులేని యువత ఉన్నారని గుర్తించారు. ఫారం-6, ఆన్‌లైన్ ద్వారా మొత్తంగా 1.64 లక్షల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. అధికారుల నివేదిక ప్రకారం ఓటు కోసం నమోదు చేసుకున్నవారు 1,47,594 మంది. అందులో పరిశీలన, విచారణ అనంతరం అనర్హులను తొలగించారు. రెండు చోట్ల ఓటు నమోదైనవారితోపాటు మొత్తంగా 44,064 దరఖాస్తులు, ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 1,03,530 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో పురుషులు 47,687 మంది కాగా మహిళలు 55,843 మంది ఉన్నారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,43,754 మందికి చేరింది. అందులో మహిళా ఓటర్లు 13,67,000, పురుషులు 13,76,754 మంది ఉన్నారు. ఈ నెల 31న ఓటరు తుదిజాబితా ప్రకటించనున్న నేపథ్యంలో ఎవరి పేర్లున్నాయో... ఎవరివి లేవో సరిచూసుకోవచ్చు.
 
 పోలింగ్ కేంద్రాలు ఖరారు
 పోలింగ్‌బూత్‌ల ఏర్పాటు ప్రక్రియ కూడా ఓ కొలిక్కివచ్చింది. మూడు నెలల క్రితమే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. అనుకూలంగా ఉన్న వాటి వివరాలతో నివేదిక సమర్పించారు. వచ్చే ఎన్నికల కోసం జిల్లాలో 3,393 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం వీటి మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement