రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జంయంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో 125 అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీసీసీ వెల్లడించింది.
హైదరాబాద్: సమాజంలోని అసమానతలు రూపుమాపే యత్నం చేసి, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జంయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.
ఈ మేరకు సోమవారం ఇందిరా భవన్ లో జరిగిన అంబేడ్కర్ ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 125 ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను సెప్టెంబర్ 12న విజయవాడలో ప్రారంభించి.. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగిస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏపీలో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమాజ అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన సేవలు, రాజ్యాంగం ద్వారా కల్పించిన అవకాశాలు, వీటి సాధనకు కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు.
కాలేజీలు, యూనివర్శిటీల్లో చర్చాగోష్టిలు, రౌండ్ టేబుల్ వంటి కార్యక్రమాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకు ఉత్సవాలను కొనసాగిస్తామన్నారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అంబేద్కర్ భావజాల వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానపత్రం రూపొందిస్తామన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణ రూపొందించడానికి పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని త్వరలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.