అగ్నిమాపక నిబంధనలు పాటించని వంద సంస్థలకు నోటీసులు జారీచేసినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.
చిత్తూరు (అర్బన్) : అగ్నిమాపక నిబంధనలు పాటించని వంద సంస్థలకు నోటీసులు జారీచేసినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 60 పాఠశాలలు, 30 పరిశ్రమలు, పది వాణిజ్య సముదాయాల్లో అగ్నిప్రమాదం జరిగితే వాటిని అదుపు చేసే ఎలాంటి పరికరాలు లేవని గుర్తిం చామన్నారు. వీటికి ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేశామన్నారు. పది రోజుల్లో అగ్నిమాపక పరికరాలు పెట్టుకోని సం స్థలపై కోర్టులో కేసులు దాఖలు చేస్తామన్నారు.
రాష్ట్ర అగ్నిమాపక చట్టం -1997 ప్రకారం నిబంధనలకు వ్యతిరేకంగా భవనాలు నిర్మించిన 16 మందిపై ఇప్పటికే కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. నేరం రుజువైతే భవన యజమానులకు రూ.5వేల నుంచి రూ.20 వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్షపడే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా టపాకాయలు విక్రయించాలంటే అనుమతి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. తాత్కాలిక అనుమతులు తీసుకున్నవారు 15 రోజుల్లో 500 కిలోల బాణసంచా వస్తువులను మాత్రమే విక్రయించాలన్నారు.
500 కిలోలు అయిపోయినా, 15 రోజులు దాటినా ఎక్కడా టపాకాయలు విక్రయించకూడదన్నారు. జిల్లాలోని ప్రతి క్లస్టర్‌లో టపాకాయల విక్రయం కోసం స్థానికంగా ఉన్న తహశీల్దార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సీఐల ఆధ్వర్యంలో అనుమతి తీసుకోవాలన్నారు. ఒక క్లస్టర్ పరిధిలో దుకాణాలు యూభైకి మించకూడదన్నారు. టపాకాయలు విక్రయించే ప్రాంతాల్లో తప్పనిసరిగా అగ్నిమాపక వాయువులు, నీళ్లు ఉంచుకోవాలన్నారు.
జిల్లాలో ప్రస్తుతం 27 అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయన్నారు. కుప్పం, నగరి, పలమనేరు, పాకాల, శ్రీకాళహస్తి, ములకలచెరువు, సత్యవేడు, పుంగనూరు ప్రాంతాల్లో కొత్త వాహనాలు ఉన్నాయని, ఒక్కొక్కటి రూ.40 లక్షల విలువజేసేవన్నారు. ఏదైనా ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జిల్లా కేంద్రమైన చిత్తూరులోని వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులో టపాకాయల విక్రయానికి హైకోర్టు అనుమతి నిరాకరించిందన్నారు. నగరంలోని మెసానికల్ గ్రౌండ్, పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాల్లో టపాకాయల విక్రయానికి స్థలాలను పరిశీలిస్తున్నామన్నారు. మూడు రోజుల్లో కలెక్టర్‌ను సంప్రదించి స్థల నిర్ధారణ చేస్తామన్నారు.