గడువులోగా ‘భగీరథ’ గగనమే

 Not Complete The Bhagiratha On The Date - Sakshi

నత్తనడకన సాగుతున్న పనులు

నెల రోజులు మాత్రమే గడువు  

మొద్దునిద్రలో అధికార యంత్రాంగం

‘రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్‌1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్‌ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యాక మిషన్‌ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన  వ్యాఖ్యలు ఇవీ.

 సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్‌ భగీరథ పథకం పనులు  సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్‌ ద్వారా బెల్లంపల్లి పుర  ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్‌ పనులు ఆసిఫాబాద్‌ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్‌ఎస్‌ఆర్, జీఎల్‌బీఆర్‌ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు.

అసంపూర్తిగా పైపులైన్‌ పనులు.. 

మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్‌ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల  దూరం వరకు పైపులైన్‌ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

స్పందించని అధికారులు..

మిషన్‌ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్‌ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top