చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్‌! | Vaibhav Suryavanshi Reveals Emotional Reason Behind Viral Celebration After Blazing Knock For LSG, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

చిత్రమైన ఫోజు.. రహస్యాన్ని బయటపెట్టిన వైభవ్‌!

May 20 2026 3:19 PM | Updated on May 20 2026 5:33 PM

Vaibhav Sooryavanshi Explains-Unique Celebration After-Fifty Runs Vs LSG

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌పై విజ‌యం సాధించ‌డం ద్వారా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువైంది. ఆదివారం (మే 24న‌) ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌ని లేకుండా 16 పాయింట్ల‌తో రాజ‌స్తాన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది. మ్యాచ్ విజ‌యంలో చిచ్చ‌ర‌పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీదే కీల‌కపాత్ర‌. 

38 బంతుల్లోనే 93 ప‌రుగులు చేసి రాజ‌స్తాన్‌ను గెలుపు తీరాల‌కు ద‌గ్గ‌ర చేశాడు. ఆ త‌ర్వాత ధ్రువ్ జురెల్ మిగ‌తాప‌నిని పూర్తి చేశాడు. అయితే తొలి 12 బంతుల్లో 11 ప‌రుగులు మాత్ర‌మే చేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఆ త‌ర్వాతి 26 బంతుల్లో 82 ప‌రుగులు చేయ‌డం విశేషం. అయితే 23 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన అనంత‌రం వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న చేతుల‌తో విచిత్ర‌మైన ఫోజు ఇచ్చాడు. 

దానికి అర్థం ఏంటా అని ఎంత జుట్టు పీక్కున్న‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. అయితే తాను ఇచ్చిన ఫోజుపై వైభ‌వ్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత వెల్ల‌డించాడు. ఆ ఫోజు వెనుక ఉన్న రహస్యాన్ని వైభవ్‌ పంచుకున్నాడు. ముర‌ళీ కార్తిక్‌తో వైభవ్‌ మాట్లాడుతూ..'ఆ ఫోజు ఎందుకు ఇచ్చానో నాకే తెలియ‌దు. ఏదో కొత్త‌గా ట్రై చేయాల‌నుకున్నా కానీ ఏం చేశానో అర్థం కాలేదు. 

లక్నోపై ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌ను తన తల్లికి అంకితం ఇస్తున్నట్లు వైభవ్ ప్రకటించాడు. తన తల్లి పేరు ‘A’ అక్షరంతో మొదలవు తుందని అందుకే వేళ్లతో ఆ సింబల్ చూపించాను’ అని స్పష్టం చేశాడు. దీంతో వైభవ్‌ తన అమ్మపై ఉన్న ప్రేమను ఇలా మైదానంలో చాటుకోవడంతో అభిమానులు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘ఇక నేను న్యూస్ పేప‌ర్లు పెద్ద‌గా చ‌ద‌వ‌ను. దీనివ‌ల్ల నా గురించి పేప‌ర్ల‌లో ఏం రాస్తున్నార‌న్నది తెలియ‌దు. అయితే నా కెరీర్‌కు ఇది ఆరంభం మాత్ర‌మే. ఇంకా సుదీర్ఘ‌మైన కెరీర్ మిగిలి ఉంది. నా దృష్టి కేవ‌లం ఆట‌పైనే త‌ప్ప ఇత‌ర విష‌యాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోను.'అని చెప్పుకొచ్చాడు. 

ఇన్నింగ్స్ మొద‌ట్లో స్లోగా ఆడ‌డంపై కూడా వైభ‌వ్ వివ‌ర‌ణ ఇచ్చాడు.'మా జ‌ట్టు బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో నేను డ‌గౌట్‌లో కూర్చున్నా. ఆ స‌మ‌యంలో వికెట్ బాగుంద‌నిపిచ్చింది. అయితే ఆదిలోనే తొంద‌ర‌ప‌డితే మొద‌టికే చేటు అని భావించి కాస్త స్లో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా. కానీ మ‌రో ఎండ్‌లో య‌శ‌స్వి జైస్వాల్ వేగంగా ఆడ‌డంతో నేను సైలెంట్ అయిపోయాను. 

ఆమె కోసమే A సింబల్.. అసలు సీక్రెట్ భయపెట్టిన బుడ్లోడు

కానీ జైస్వాల్ ఔట‌య్యేట‌ప్ప‌టికీ పిచ్‌పై పూర్తి అవ‌గాహ‌న వ‌చ్చేసింది. అందుకే ఆ త‌ర్వాత స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ ఆడాను. నేను ఎక్కువసేపు క్రీజులో ఉండ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకొని బ్యాటింగ్ కొన‌సాగించాను. అయితే సెంచ‌రీ మిస్ అవ్వ‌డంపై కాస్త నిరాశ‌కు లోనైన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌డం ఆ బాధ‌ను మ‌రిచిపోయేలా చేసింది. 

ఈ విజ‌యంతో ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువ‌య్యాం. కానీ ఇప్పుడు మా దృష్టంతా ఆదివారం ముంబై ఇండియ‌న్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌పైనే ఉంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌డ‌మే మా ఏకైక ల‌క్ష్యం' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: టీమిండియాలోకి వైభవ్‌.. అగార్కర్ కీలక వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement