చరిత్ర తిరగరాసిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Sooryavanshi became the youngest to aggregate over 500 runs in a single IPL season | Sakshi
Sakshi News home page

చరిత్ర తిరగరాసిన వైభవ్‌ సూర్యవంశీ

May 20 2026 10:41 AM | Updated on May 20 2026 11:25 AM

Vaibhav Sooryavanshi became the youngest to aggregate over 500 runs in a single IPL season

రాజస్థాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించాడు. నిన్న (మే 19) లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 93 పరుగులు చేసిన అతడు.. ఈ సీజన్‌లో తన పరుగుల సంఖ్యను 579కి పెంచుకున్నాడు. 

తద్వారా ప్రపంచంలో ఏ టీ20 టోర్నీలోనైనా 500 పరుగులు చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (15 ఏళ్లు) చరిత్రలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిషబ్‌ పంత్‌ పేరిట ఉండేది. పంత్‌ 2018 ఎడిషన్‌లో 20 ఏళ్ల వయసులో (ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున) ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్‌ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. ఇందులో మొదటిది ఈ సీజన్‌లో ఇప్పటివరకు 236.33 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేసిన అతడు.. ఓ సీజన్‌లో 500 ప్లస్‌ పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక​ స్ట్రయిక్‌రేట్‌ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. 

గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్‌ పేరిట ఉండేది. రసెల్‌ 2019లో 204.8 స్ట్రయిక్‌రేట్‌తో ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ కూడా 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో (202) పరుగులు చేశాడు. 

సిక్సర్ల ఫిఫ్టి
ఈ మ్యాచ్‌లో 10 సిక్సర్లు బాదిన వైభవ్‌ ఈ సీజన్‌లో తన సిక్సర్ల సంఖ్యను 53కు పెంచుకున్నాడు. తద్వారా ఓ సింగిల్‌ సీజన్‌లో 50 సిక్సర్ల మార్కును తాకిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఓ సింగిల్‌ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ (59) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

ఈ మ్యాచ​్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్‌.. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఈ సీజన్‌లో అతడి ‘స్లోయెస్ట్‌’ ఫిఫ్టీ కావడం మరో విశేషం.

మ్యాచ్‌ విషయానికొస్తే.. వైభవ్‌ విధ్వంసం ధాటికి లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగు చేసుకుంది. ఆర్సీబీ, గుజరాత్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు దక్కించుకున్న విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement