
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కూడా ప్రభ్‌సిమ్రాన్ బ్యాట్ ఝూళిపించాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను ప్రభ్‌సిమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరపున వరుసగా అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్‌గా రికార్డులెక్కాడు. ఈ ఏడాది సీజన్‌లో ప్రభుసిమ్రాన్ వరుసగా హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మాక్స్‌వెల్ పేరిట సంయుక్తంగా ఉండేది.
వీరంతా వరుసగా మూడు సార్లు పంజాబ్ తరపున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.తాజా మ్యాచ్‌లో ఆర్ధశతకంతో మెరిసిన ప్రభ్‌సిమ్రాన్ వీరిని అధిగమించాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్ కూడా ప్రభ్‌సిమ్రానే కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇప్పటికి (ఈ మ్యాచ్‌తో కలిపి) 12 ఇన్నింగ్స్‌లు ఆడిన ప్రభ్‌సిమ్రన్ 487 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్దానంలో కొనసాగుతున్నాడు.
మ్యాచ్ రద్దు..
కాగా భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ను నిర్వహకులు రద్దు చేశారు.భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ స్ధానికంగా బ్లాక్ అవుట్ విధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్‌ను మధ్యలోనే ఆపేశారు. మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి పంజాబ్ స్కోర్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.