ఐపీఎల్ 2026లో కేకేఆర్ ప్రస్తానం ఆసక్తికరంగా కొనసాగుతోంది. సీజన్ తొలి 6 మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఈ జట్టు, అనూహ్యంగా తదుపరి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో (మే 24) ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ తేడాతో గెలిచి.. రాజస్థాన్ ముంబై ఇండియన్స్ చేతిలో, పంజాబ్ కింగ్స్ లక్నో చేతిలో ఓడితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఆర్సీబీ, గుజరాత్, ఎస్‌ఆర్‌హెచ్ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.
పైన అనుకున్నట్లుగా అన్నీ జరిగి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే పెను సంచలనమవుతుంది. సీజన్ ప్రారంభంలో వివాదాలు (ముస్తాఫిజుర్ రహ్మాన్), గాయాలతో సతమతమైన ఈ జట్టు.. ఓ దశలో నైరాశ్యంలోకి కూరుకుపోయి, గెలుపు లేకుండానే సీజన్‌ను ముగించేలా కనిపించింది.
అయితే ఆ జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు హోప్ కోల్పోకుండా తమవంతు ప్రయత్నాలు చేసి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే తన కుర్రాళ్లలో అనునిత్యం స్పూర్తి నింపుతూ, పతనావస్థలో ఉన్న జట్టును తిరిగి గెలుపు ట్రాక్ ఎక్కించాడు.
అన్నీ కలిసొచ్చి కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరితే, ఆపై టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముందునుంచీ ఈ జట్టు బలహీనంగా ఏమీ లేనప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో తడబాట్ల వల్ల వరుస పరాజయాలు ఎదుర్కొంది.
ఎప్పుడైతే పేసర్ కార్తీక్ త్యాగి, స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లైన్‌లోకి వచ్చారో, అప్పుడే కేకేఆర్ ఫేట్ మారడం మొదలైంది. ఈ త్రయం దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో సత్తా చాటుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. వీరికి అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కెమరూన్ గ్రీన్ లాంటి పేసర్లు కూడా తోడైతే కేకేఆర్ బౌలింగ్ యూనిట్ తిరుగులేని శక్తిగా మారిపోతుంది.
బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కేకేఆర్ సీజన్ ప్రారంభం నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తూ వస్తుంది. అంగ్‌కృష్ రఘువంశీ, రింకూ సింగ్ దాదాపుగా ప్రతి మ్యాచ్‌లో రాణిస్తూ వస్తున్నారు. కేకేఆర్ విజయాల ట్రాక్ ఎక్కిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా లైన్‌లోకి వచ్చాడు. రోవ్‌మన్ పావెల్ అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్నాడు.
తాజాగా ముంబై ఇండియన్స్‌పై గెలుపులో పావెల్ కీలకపాత్ర పోషించాడు. సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన మనీశ్ పాండే మంచి ఫామ్‌లో ఉండటం కేకేఆర్‌కు అదనంగా కలిసొచ్చే విషయం. మొత్తంగా రహానే, గ్రీన్ ఫామ్ మాత్రమే కేకేఆర్‌ను కలవరపెడుతుంది. వీరు కూడా లైన్‌లోకి వచ్చి తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటితే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది.


