చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్-2026 ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. వెళ్తూ వెళ్తూ తమతో పాటు గుజరాత్ టైటాన్స్‌ను కూడా టాప్-4కి తీసుకువెళ్లింది. తాజాగా అదే చెన్నై జట్టును చిత్తుగా ఓడించిన గుజరాత్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువెళ్లింది. సన్‌రైజర్స్‌ను మూడో స్థానానికి నెట్టివేసింది.
గుజరాత్.. రైట్ రైట్
చెన్నైతో గురువారం నాటి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సొంతమైదానం అహ్మదాబాద్‌లో లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల తేడాతో.. ఐదుసార్లు విజేత చెన్నైని చిత్తు చేసింది.
తద్వారా టైటాన్స్ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 5 పరాజయాలతో 18 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు.. 14 మ్యాచ్‌లలో 6 విజయాలు, 8 పరాజయాలతో 12 పాయింట్లు సాధించిన చెన్నై ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి నిష్క్రమించింది.
ఇదిలా ఉంటే.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 13 మ్యాచ్‌లకు గానూ 9 గెలిచిన ఆర్సీబీ 18 పాయింట్లు సాధించింది. నెట్‌రన్‌రేటు పరంగా గుజరాత్ (+0.695) కంటే ఆర్సీబీ (+1.065) మెరుగ్గా ఉండటంతో టాప్‌లోనే కొనసాగుతోంది.
సన్‌రైజర్స్ నెత్తిన పిడుగు
ఇక లీగ్ దశలో తమకు మిగిలిన ఒకే ఒక్క మ్యాచ్‌లో సన్‌రైజర్స్- ఆర్సీబీ శుక్రవారం ముఖాముఖి తలపడనున్నాయి. సన్‌రైజర్స్ సొంతమైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌కు షెడ్యూల్ ఖరారైంది.
నిజానికి చెన్నైపై గుజరాత్ భారీ విజయం సాధించడంతో... సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాప్–2లో నిలిచే అవకాశాలు కాస్త క్లిష్టమయ్యాయనే చెప్పవచ్చు.
పట్టికలో గుజరాత్‌ను వెనక్కినెట్టి సన్‌రైజర్స్ రెండో స్థానానికి చేరాలంటే... ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 88 పరుగుల ఆధిక్యంతో గెలవాలి.
ఛేజింగ్ చేస్తే బెంగళూరు నిర్దేశించిన లక్ష్యాన్ని సన్‌రైజర్స్ సుమారుగా 12 ఓవర్లలోపు ఛేదించాలి.
సన్‌రైజర్స్ టాప్-2కి చేరాలంటే సమీకరణలు ఇలా..
👉తొలుత బ్యాటింగ్‌కు దిగి 250 రన్స్ చేస్తే.. ఆర్సీబీ మీద కనీసం 90 పరుగుల తేడాతో గెలవాలి.
👉సన్‌రైజర్స్ 200 పరుగులు చేస్తే.. ఆర్సీబీ మీద 87 పరుగుల తేడాతో గెలవాలి.
👉ఒకవేళ ఆర్సీబీ 200కు పైగా లక్ష్యం విధిస్తే సన్‌రైజర్స్ దానిని 11.2 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది.
సన్‌రైజర్స్‌కు ఉన్న సానుకూలతలు
👉సొంతమైదానంలో రాత్రి జరిగిన నాలుగు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ గెలుపొందింది.
👉ఉప్పల్‌లో ఇషాన్ మలింగ 11 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
👉పవర్ ప్లేలో ప్రఫుల్ హింగే సొంతమైదానంలో ప్రతి పది బంతులకు ఒక వికెట్ తీయడం సానుకూలాంశం
👉ఆర్సీబీ మీద హెన్రిచ్ క్లాసెన్ 196కు పైగా స్ట్రైక్‌రేటుతో 46.4 సగటుతో పరుగులు రాబట్టాడు.
👉ఆర్సీబీ దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి వికెట్‌ను ముందుగానే పడగొడితే సన్‌రైజర్స్‌పై ఒత్తిడి కాస్త తగ్గుతుంది.
టాప్-2 చేరితే ఉపయోగం ఏమిటి?
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం.. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.
అయితే, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం కూడా ఉంటుంది. కాగా పట్టికలో టాప్-3, 4లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది.
ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్తుంది.


