పాక్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ | Bangladesh beat Pakistan by 78 runs in second test | Sakshi
Sakshi News home page

పాక్‌కు ఘోర పరాభవం.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

May 20 2026 11:49 AM | Updated on May 20 2026 12:42 PM

Bangladesh beat Pakistan by 78 runs in second test

పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టుకు ఘోర పరాభవం​ ఎదురైంది. తొలిసారి ఈ జట్టు బంగ్లాదేశ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. సిల్హెట్‌ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 78 పరుగుల తేడాతో ఓడటంతో 0-2తో క్లీన్‌ స్వీప్‌ అయ్యింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆ జట్టు భారత్‌ను సైతం కిందకు (ఆరో స్థానానికి) నెట్టింది. ఆసీస్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక టాప్‌-4 జట్లుగా కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో పాక్‌ మరింత పతనమై ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ గెలుపు బంగ్లాదేశ్‌కు పాక్‌పై వరుసగా నాలుగవది. అంతకుముందు రెండు టెస్ట్‌లకు బంగ్లాదేశ్‌ పాక్‌ గడ్డపైనే గెలిచింది. ఈ ఏడాది మార్చిలో బంగ్లా జట్టు పాక్‌ను వన్డే సిరీస్‌లోనూ ఓడించింది. 

రిజ్వాన్‌ పోరాటం వృధా
437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్‌ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్‌ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్‌ పతనాన్ని శాశించాడు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (126) సెంచరీతో కదంతొక్కాడు. పాక్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షెహజాద్‌ (17-1-81-4), మొహమ్మద్‌ అబ్బాస్‌ (16-3-45-3) రాణించారు. అనంతరం పాక్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. బాబర్‌ ఆజం (68) ఒక్కడే రాణించడంతో అతి కష్టంమీద 232 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో తైజుల్‌, నహిద్‌ రాణా తలో 3, తస్కిన్‌, మెహిది హసన్‌ మిరాజ్‌ చెరో 2 వికెట్లతో పాక్‌ ఆట కట్టించారు.

కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ ఈ ఇన్నింగ్స్‌లోనూ తొలుత తడబడినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ముష్ఫిఫర్‌ రహీం​ (137) సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్‌ 390 పరుగుల భారీ స్కోర్‌ చేసి పాక్‌కు 437 పరుగుల టార్గెట్‌ సెట్‌ చేసింది. ఛేదనలో రిజ్వాన్‌ సహా షాన్‌ మసూద్‌ (71), సల్మాన్‌ అఘా (71) అర్ద సెంచరీతో రాణించినా పాక్‌ను గట్టెక్కించలేకపోయారు. 

Advertisement
 
Advertisement
Advertisement