ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ చేయి ఇవ్వనుందా? వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త మిత్రుడి పొత్తు కోసం హస్తం పార్టీ ప్రయత్నిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. యూపీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఈ వాదనలకు బలాన్ని చూకూరుస్తున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. అందుకే ఈసారి కొత్త పొత్తు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.
2027 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతితో సంప్రదింపులకు రాహుల్ గాంధీ తన ప్రతినిధుల బృందాన్ని లక్నోకు పంపించారని సమాచారం. బారాబంకి ఎంపీ తనుజ్ పునియా (Tanuj Punia), కాంగ్రెస్ షెడ్యూల్డ్ కులాల శాఖ జాతీయ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఈ పని మీదే లక్నోకు పంపినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. బీఎస్పీ అధినేత్రి లక్నోలో ఉన్నారని తెలుసుకుని కాంగ్రెస్ ప్రతినిధులు ఆమె నివాసానికి వచ్చారని, అయితే వారిని కలిసేందుకు మాయావతి సుముఖత చూపలేదని సమాచారం.
మాయావతి నో
రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు ప్రారంభించాలని రాహుల్ గాంధీ కోరుకున్నారని, ఇదే మాటను మాయావతితో చెప్పడానికి కాంగ్రెస్ ప్రతినిధులు లక్నోకు వచ్చారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హస్తం పార్టీ నాయకులతో భేటీ కావడానికి బీఎస్పీ అధినేత్రి నిరాకరించడంతో, ఆమె ఇంటి గేటు వద్ద తమ వివరాలు నమోదు చేసి వారు వెనుదిరిగారని సమాచారం. ఈ తాజా పరిణామం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాల్లో పలు ఊహాగానాలకు తెరతీసింది.
ఎస్పీతో పొత్తుపై అసంతృప్తి
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉంది. జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్‌లోనూ సమాజ్‌వాదీ పార్టీ భాగస్వామిగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అయితే, ఎస్పీతో పొత్తు పట్ల కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యంలో కొనసాగడం కంటే బీఎస్పీతో అవగాహనకు రావడం రాజకీయంగా ఎక్కువ ప్రయోజనకరమని పార్టీలోని చాలామంది భావిస్తున్నారని ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 'మనీకంట్రోల్'తో అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం రావాలంటే సమాజ్‌వాదీ పార్టీని వదిలి బీఎస్పీతో జట్టు కట్టడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ స్వతంత్రంగా పుంజుకోవడానికి ఎస్పీ ఎప్పటికీ తగినన్ని సీట్లు ఇవ్వదు. గెలుపు అవకాశాలు పరిమితంగా ఉన్న కష్టమైన సీట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కట్టబెడుతుంది. 402 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ సుమారు 100 నుంచి 125 సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది, కానీ ఎస్పీ 40 నుంచి 50 సీట్లకు మించి ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు" అని ఆ సీనియర్ నాయకుడు అన్నారు.
బీఎస్పీకి కూడా లాభమే
తమ పార్టీతో చేతులు కలిపితే బీఎస్పీ కూడా పుంజుకునే అవకాశం ఉందని మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. బీజేపీ భయంతో ఆమె తమతో పొత్తు పెట్టుకునేందుకు ఇష్టపడకపోవచ్చారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో మాయావతిపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీపై అసంతృప్తితో ఉన్న పలు వర్గాలు ఎస్పీకి ఓటు వేయడానికి ఇష్టపడటం లేదని, కాంగ్రెస్- బీఎస్పీ కలిస్తే ఈ ఓటర్లను తమవైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ, దళిత ఓటు బ్యాంకును బీఎస్పీ కాపాడుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ప్రతిపక్ష ఐక్యతను విస్తృతం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీఎస్పీలకు సంబంధించిన రాజకీయ సమీకరణాలలో ఎలాంటి మార్పు వచ్చినా.. అది 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుల సమీకరణాలను గణనీయంగా మార్చగలదని అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌కు చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు.
బహిరంగ చర్చలకు నో
మరోవైపు మాయావతి ఇటీవల కాలంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రెండింటికీ సమాన దూరం పాటిస్తున్నారు. ఎన్నికల ప్రయోజనాల కోసం దళిత రాజకీయాలను వాడుకుంటున్నాయని ఆ రెండు పార్టీలపై తరచుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందాన్నికలవడానికి ఆమె నిరాకరించారు. ఈ సమయంలో కాంగ్రెస్‌తో బహిరంగంగా చర్చలు జరపడానికి ఇష్టపడటం లేదనే సంకేతాన్ని ఆమె ఇచ్చారు.
చదవండి: బీజేపీలో భారీ ప్రక్షాళన.. కీలక మార్పులు!
పొత్తు చర్చల కోసం కాదు
మాయావతిని మర్వాదపూర్వకంగా కలిసేందుకు మాత్రమే ఆమె ఇంటికి వెళ్లామని, పొత్తు చర్చల కోసం కాదని రాజేంద్ర పాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) తెలిపారు. “మాయావతి ఒక సీనియర్ దళిత నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి. ఆమె యోగక్షేమాలను తెలుసుకోవడం మా బాధ్యత. అందుకే ఆమె ఇంటికి వెళ్లాం. మేము గేటు వద్ద మా పేర్లు నమోదు చేసి వచ్చాం. ఆమె ఎప్పుడు పిలిచినా, ఆమెను మళ్ళీ కలుస్తాము” అని గౌతమ్ అన్నారు. ఈ పర్యటన గురించి గానీ, పొత్తు చర్చలకు సంబంధించిన ఊహాగానాల గురించి గానీ బీఎస్పీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.


